Madhya Pradesh: మరుగుడొడ్లను శుభ్రం చేసిన మంత్రి!

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యల్లో అతి పెద్దది.. మరుగుదొడ్ల వ్యవస్థ సరిగా లేకపోవడం. మరుగుదొడ్లు ఉన్నా అపరిశుభ్రంగా ఉండటం,

Published : 18 Dec 2021 22:26 IST

గ్వాలియర్‌: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యల్లో అతి పెద్దది.. మరుగుదొడ్ల వ్యవస్థ సరిగా లేకపోవడం. మరుగుదొడ్లు ఉన్నా అపరిశుభ్రంగా ఉండటం, నిర్వహణ లోపం కారణంగా బాలికలు పాఠశాలలకు వెళ్లడానికి వెనుకాడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి స్వయంగా రంగంలోకి దిగి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ రాష్ట్ర ఇంధన మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ తోమర్‌.. తరచూ పాఠశాలలను సందర్శిస్తూ అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను స్వయంగా శుభ్రం చేస్తున్నారు. మంత్రి హోదాను పక్కన పెట్టి స్వయంగా టాయిలెట్లను శుభ్రం చేస్తున్న ఈయన పని వెనక ఓ సదుద్దేశమే ఉంది. ‘స్వచ్ఛత-పరిశుభ్రత’ కార్యక్రమంలో భాగంగా 30 రోజులపాటు మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని మంత్రి సంకల్పించుకున్నారు. ఈ క్రమంలో గ్వాలియర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బోధన బాగున్నా.. టాయిలెట్ల పరిస్థితి ఘోరంగా ఉందని, దుర్గంధం వెదజల్లుతూ వినియోగానికి వీలు లేకుండా ఉన్నాయని చిన్నారులు వివరించారు. వెంటనే ఆయన బ్రష్‌, నీటి పైపు తీసుకొని తానే స్వయంగా మరుగుదొడ్లను శుభ్రం చేశారు. పనులు చేయించే అధికారంతోపాటు వాటిని స్వయంగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజా ప్రతినిధులకు ఉంటుందని ప్రద్యుమన్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు. వారి బాధ్యతను గుర్తు చేసేందుకే తాను స్వయంగా ఈ పనికి పూనుకున్నట్టు తెలిపారు. తమ చుట్టుపక్కన ఉన్న పాఠశాలల పరిశుభ్రత అందరి బాధ్యత అంటూ వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేయడమే కాకుండా విద్యార్థులతో ముచ్చటించి పరిశుభ్రతపై వారికి అవగాహన కల్పిస్తున్నారు మంత్రి.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని