Published : 17 Jul 2021 01:07 IST

శస్త్ర చికిత్స తర్వాత తిరగబెడుతున్నబ్లాక్‌ ఫంగస్‌ కేసులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ నుంచి కోలుకున్న మధుమేహ రోగుల్లో ఒకట్రెండు వారాల్లో కన్నువాపు, ముక్కులోంచి నల్లటి ద్రవం లాంటివి రావడం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలనేది తెల్సిందే. బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిన రోగులకు అవసరాన్ని బట్టి వైద్యుల బృందం శస్త్ర చికిత్స చేసి, ఆ తర్వాత మందులు వాడమని చెబుతుంటారు. రోగ తీవ్రతను బట్టి యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు రోజుకు ఆరు వరకు వాడాల్సి ఉంటుంది. ఒకసారి శస్త్ర చికిత్స చేశాక రోగులు మందులు వాడుతూ ఇక భయపడాల్సిందేమీ లేదనుకుంటారు. అయితే శస్త్రచికిత్సలో దెబ్బతిన్న సైనస్‌ కణజాలాన్ని పూర్తిగా తొలగించకపోతే కొన్ని రోజులు లేదా ఒకట్రెండు నెలల తర్వాత బ్లాక్‌ఫంగస్‌ మళ్లీ తిరగబెట్టొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకసారి శస్త్ర చికిత్సకు గురైన రోగుల్లో 20 శాతం మందిలో మళ్లీ బ్లాక్‌ ఫంగస్‌ కనిపిస్తున్నట్లు పుణెకు చెందిన ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నారు. ‘‘బ్లాక్‌ఫంగస్‌ తిరగబెట్టడం అనేది అరుదైనదేం కాదు. ప్రస్తుతం మళ్లీ శస్త్ర చికిత్స అవసరమవుతున్నవారు 20 శాతం వరకు ఉంటున్నారు’’ అని పుణెలోని ససూన్‌ జనరల్‌ ఆసుపత్రిలోని ఈఎన్‌టీ వైద్యులు సమీర్‌ జోషి తెలిపారు. ‘‘ఒకేసారి ఆపరేషన్‌ చేసి మొత్తంగా ఫంగస్‌ను తొలగించడం కష్టమవుతోంది. ఎందుకంటే బ్లాక్‌ఫంగస్‌ వ్యాపించిన మృత, సజీవ కణజాలానికి మధ్య తేడాను గుర్తించడం కష్టం. అందువల్ల శస్త్రచికిత్స తర్వాత ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా శుభ్రపరచాలి. అలాగే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్సన్లు, ఇతర మందులు కనీసం రెండు వారాల పాటు విధిగా వాడాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే మళ్లీ వ్యాధి రాకుండా అడ్డుకోగలం’’ అని అన్నారు.

‘‘సైనస్‌లో వ్యాపించిన బ్లాక్‌ఫంగస్‌కు మొదటిసారి శస్త్ర చికిత్స చేసినప్పుడు దెబ్బతిన్న కణజాలాన్ని పూర్తిగా తొలగిస్తే, మళ్లీ తిరగబెట్టడం ఉండదు. కానీ ఇక్కడే నిపుణుల పాత్ర, వైద్యుల అనుభవం అవసరం అవుతుంది. సర్జన్‌కు సైనస్‌కు సంబంధించిన వేర్వేరే భాగాల్లో ఎంతమేర ఫంగస్‌ వ్యాపించిందో సరిగ్గా అంచనాకు రావడం కష్టమైతే తన సీనియర్‌ వైద్యుల సహాయం తప్పక తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. కొందరు వైద్యులు వెంట వెంటనే వరుసగా సర్జరీలు చేయాలనుకుంటారు. బ్లాక్‌ఫంగస్‌ నివారణకు కేవలం ఆపరేషన్లు మాత్రమే మార్గమని భావించకూడదు. ఎందుకంటే ఫంగస్‌ సోకిన ప్రాంతాన్ని సరిగ్గా గుర్తించి ఆపరేషన్‌ చేయకపోతే వ్యాధి తగ్గకపోగా మరింత వ్యాపిస్తుంది. అందువల్ల, రోగి వాడిన యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్‌ ప్రభావాన్ని అంచనా వేశాకనే మళ్లీ సర్జరీ చేయాలో వద్దో నిర్ణయించాలి. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ను సరిగ్గా విశ్లేషించనప్పుడు కూడా వ్యాధి సోకిన భాగాన్ని గుర్తించడం జటిలమవుతుంది’’ అని ఆయన చెప్పారు. ‘‘అయితే వివిధ విభాగాలకు చెందిన వైద్యులు బృందంగా ఏర్పడి, చాలా జాగ్రత్తలు తీసుకుని శస్త్ర చికిత్సలు చేయడంతో, తమ వద్ద చికిత్స తీసుకున్న 62 మందిలో ఇంతవరకూ తిరగబెట్టిన కేసులు రాలేదు’’ అని మరో వైద్యుడు జె.బి.గార్డె తెలిపారు. ‘‘బ్లాక్‌ఫంగస్‌ తిరగబెట్టకుండా కట్టడి చేయాలంటే సర్జరీ తర్వాత యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను తగిన మోతాదులో ఇవ్వాలి. ఆ తర్వాత పొసకొనజోల్‌ మాత్రలు కూడా ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ ఆపరేషన్‌ చేసిన ప్రాంతంలో ఫంగస్‌ ఇంకా మిగిలి ఉన్నా లేదా రక్తంలో ఉండాల్సిన మోతాదుకంటే మందుల స్థాయి తక్కువైనా మళ్లీ వ్యాధి కనిపించవచ్చు’’ అని జాతీయ కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌లో సభ్యులు, అంటువ్యాధుల నిపుణులు సంజయ్‌ పూజారి తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని