TS news : ప్రముఖ జ్యోతిషపండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత

ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబీకులు..

Published : 24 Jan 2022 02:02 IST

హైదరాబాద్‌ : ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆయన్ను ఆదివారం ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

ములుగు సిద్ధాంతిగా పేరొందిన రామలింగేశ్వర సిద్ధాంతి 30 ఏళ్లుగా జ్యోతిషులుగా విశేష సేవలందించారు. రాశిఫలాలతో పాటు, ఆయన చెప్పే జ్యోతిషాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం విశ్వసిస్తుంటారు. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు.. ఇలా పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు తన అంచనాలను వెలువరించేవారు. ఆయన మృతిపట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ములుగు సిద్ధాంతి అంత్యక్రియలు సోమవారం ఉదయం 11 గంటలకు మలక్‌పేట్ రేసుకోర్సు సమీపంలోని హిందూ స్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితుడిగా, శ్రీశైలం పీఠాధిపతిగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా జ్యోతిషంలో సేవలందించిన ఆయన గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన ఎంఆర్‌ ప్రసాద్‌ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. సినీ నటులు ఏవీఎస్‌, బ్రహ్మానందం తదితర కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చారు.

శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి పూజా హోమాది క్రతువుల్లో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతి మాసశివరాత్రికి  పాశుపతహోమాలు నిర్వహించేవారు. ప్రతి ఏడాది ములుగు సిద్ధాంతి అందించే పంచాంగ ఫలితాలను యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా కోట్లాది మంది వీక్షించేవారు. కరోనా నేపథ్యంలో లోక కల్యాణం కోసం ములుగు సిద్ధాంతి ఇటీవల యాదాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాల్లో ఆయుష్య హోమాలు నిర్వహించినట్లు ఆయన కుమారుడు సోమేష్‌కుమార్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని