ఆ మహిళా కానిస్టేబుల్‌.. ముంబయి థెరిసా!

పోలీసులంటే కఠినాత్ములని, కనికరం.. మానవత్వం ఉండదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. వృత్తిపరంగా వారు అలా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ, వారిలోనూ ఎంతో మంది మానవత్వాన్ని చాటుకునే పోలీసులున్నారు. అలాంటి పోలీసే రెహనా షేక్‌ బాగ్వాన్‌. ముంబయిలో కానిస్టేబుల్‌గా

Updated : 12 Jul 2021 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పోలీసులంటే కఠినాత్ములని, కనికరం.. మానవత్వం ఉండదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. వృత్తిపరంగా వారు అలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. కానీ, వారిలోనూ ఎంతో మంది మానవత్వాన్ని చాటుకునే పోలీసులున్నారు. అలాంటి పోలీసే రెహనా షేక్‌ బాగ్వాన్‌. ముంబయిలో కానిస్టేబుల్‌గా చాలిచాలని జీతం అందుకునే రెహనా ఏకంగా 50 మంది పేద విద్యార్థులను దత్తతకు తీసుకుంది. అంతేకాదు.. అనేక రకాలుగా సమాజ సేవ చేస్తూ ముంబయి మదర్‌ థెరిసాగా గుర్తింపు పొందుతోంది. 

రాయ్‌గఢ్‌ జిల్లాలోని వాజే తాలుకాలో ఉన్న ధ్యాని విద్యాలయంలోని 50 మంది గిరిజన పిల్లల్ని రెహనా దత్తత తీసుకుంది. వారి చదువు, ఆలనాపాలన బాధ్యతలను తనే స్వీకరించింది. గతేడాది తన కుమార్తె పుట్టిన రోజును ఓ పాఠశాలలో నిర్వహించాలని భావించిన రెహనా ధ్యాని విద్యాలయం ప్రిన్సిపాల్‌ను సంప్రదించి కుటుంబంతోపాటు అక్కడికి వెళ్లింది. అయితే, ఆ పాఠశాలలో చాలా మంది గిరిజన విద్యార్థులకు సరైన దుస్తులు, చెప్పులు లేకపోవడం చూసి చలించిపోయిందామె. వారిని ఎలాగైనా ఆదుకోవాలని నిర్ణయించుకుంది. తన కుటుంబసభ్యులతో చర్చించి ఆ ఏడాది తన కుమార్తె పుట్టిన రోజు, పండుగలకు కొత్త దుస్తులు, వేడుకలు మానుకొని ఆ డబ్బును పాఠశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే, విద్యార్థుల క్రమశిక్షణ.. వారి ప్రతిభను చూసిన రెహనా మనసు మార్చుకొని, విరాళం ఇవ్వడం కాదు.. వారిని దత్తత తీసుకొని, చదివిస్తానని వెల్లడించింది.

కేవలం విద్యార్థుల దత్తతే కాదు.. కరోనా సమయంలోనూ అనేక మందికి తనకు తోచిన విధంగా సాయం చేసింది. ఆస్పత్రుల్లో పడకల వసతి, రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు బాధితులకు సరిగా అందించడానికి కృషి చేసిన ఆమె రక్తదానంలో ఎప్పుడూ ముందుంటుంది. అందుకే, రెహనా సేవలను మెచ్చి తాజాగా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ ఆమెను సత్కరించారు. మంచి చేసేవారికి మంచే జరుగుతుందన్నట్లు ఇటీవల ఆమె డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. దీంతో త్వరలో రెహనా ఎస్సై కాబోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని