
Mumbai: ముంబయి పోలీస్ డ్యాన్స్ అదరగొట్టారు..!
దిల్లీ: అద్భుతమైన డ్యాన్స్ చేసి ఓ పోలీస్ అధికారి సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారారు. పాటకు తగ్గట్టు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆకట్టున్నారు. ముంబయికి చెందిన పోలీస్ అధికారి అమోల్ యశ్వంత్ కాంబ్లే చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. అప్పు అనే బాలీవుడ్ సినిమాలోని ‘ఆయా హే రాజా’ పాటకు ఆయన చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఆ వీడియోను 2 లక్షల మందికి పైగా వీక్షించారు.
దీనిపై కాంబ్లే స్పందిస్తూ.. ‘ఓ పోలీస్ అధికారిగా శాంతిభద్రతలను కాపాడుతూ పౌరులను సంరక్షించడం నా బాధ్యత. నా డ్యూటీలో భాగంగానే ప్రజలు కరోనా బారిన పడకుండా మాస్క్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నాం. ఈ నేపథ్యంలో బైక్‌పై వచ్చిన యువకుడితో కొన్ని డ్యాన్స్ స్టెప్పులు వేశాను. సెలవు రోజుల్లో నా పిల్లలతో సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉంటాను’ అని తెలిపారు. అయితే కాంబ్లే చిన్నతనం నుంచి డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను చేసిన డ్యాన్స్ వీడియోలను ఇతరులతో పంచుకుంటారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 24 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.