Corona: ఇదే పర్‌ఫెక్ట్‌ రెసిపీ..

ముంబయి పోలీసులు వినూత్న అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ మూడు జాగ్రత్తలను రెసిపీగా వర్ణించారు. ‘సురక్షితంగా ఉంచేందుకు పర్‌ఫెక్ట్‌ రెసిపీ’ అంటూ ఓ గ్రాఫిక్‌ డిజైన్‌ ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు....

Published : 11 May 2021 01:10 IST

ముంబయి పోలీసుల వినూత్న అవగాహన

ముంబయి: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్దిరోజులుగా ప్రతిరోజు 3 నుంచి 4 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ముంబయి పోలీసులు వినూత్న అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ మూడు జాగ్రత్తలను రెసిపీగా వర్ణించారు. ‘సురక్షితంగా ఉంచేందుకు పర్‌ఫెక్ట్‌ రెసిపీ’ అంటూ ఓ గ్రాఫిక్‌ డిజైన్‌ ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. 

ఆ రెసిపీలో మొట్టమొదటిగా చేయాల్సిన పని.. రెండు పొరల మాస్కు ధరించడం, రెండోది ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం, మూడో స్టెప్‌.. అత్యవసరమైతేనే బయటకు వెళ్లడం. ఈ మూడు జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా ఉంటారు అని గ్రాఫిక్‌ డిజైన్‌ రూపంలో వివరించారు. దానిని ముంబయి పోలీసు కమిషనర్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘కర్ఫ్యూ ముగిసేంతవరకు ఇంట్లోనే ఉండి చిల్‌ అవ్వండి.  ఈ మూడు జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా ఉంటారు. జాగ్రత్తలు మరిస్తే ప్రమాదంతో పడతారు’ అంటూ ట్వీట్‌ చేశారు. 

దేశంలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం 3.66 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 3754 మంది మృతిచెందారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 48401 మంది వైరస్‌ బారినపడగా 572 మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని