Published : 15 Jan 2021 03:11 IST

అతడి రక్తంలో పుట్టగొడుగులు పెరిగాయి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వైద్యో నారాయణో హరి’ అంటారు పెద్దలు. ఏదైనా వ్యాధి సోకితే వైద్యులను సంప్రదించాల్సిందే. వారు సూచించిన మందులు వాడితేనే వ్యాధి నుంచి త్వరగా కోలుకోగలం. అలా కాదని కొందరు సొంత వైద్యం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రతి దాన్ని ఇంటర్నెట్‌లో శోధించి సొంతంగా తెలుసుకునే అలవాటు ప్రజల్లో బాగా పెరిగిపోయింది. ఇది మంచిదే. కానీ, వైద్యం విషయంలోనూ ఇంటర్నెట్‌పై ఆధార పడటం ఎంత ప్రమాదకరమో ఇటీవల ఓ జర్నల్‌లో ప్రచురించిన సంఘటన తెలియజేస్తుంది. మానసిక రోగంతో బాధపడుతున్న ఓ యువకుడు వైద్యులు సూచించిన మందులు కాకుండా ఇంటర్నెట్‌లో చూసి సొంత వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

జర్నల్‌ ఆఫ్‌ ది అకాడమీ ఆఫ్‌ కన్సల్టేషన్‌ - లియసన్‌ సైకియాట్రీ కథనం ప్రకారం.. ఓ 30 ఏళ్ల యువకుడు(బాధితుడి వివరాలు వెల్లడించలేదు) మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. అయితే, వాటి నుంచి బయటపడాలన్న ప్రయత్నంలో మానసిక వ్యాధికి గురయ్యాడు. అతడికి బైపోలార్‌ డిజార్డర్‌ కూడా ఉంది. దీంతో వైద్యులు అతడికి కొన్ని మందులు సూచించారు. కానీ, ఆ యువకుడు వాటిని వేసుకోవడం మానేసి సొంత వైద్యంపై దృష్టి పెట్టాడు. ఈ మేరకు ఇంటర్నెట్‌లో ఆన్వేషించగా.. మానసిక ఆందోళనను, ఒత్తిళ్లను దూరం చేయడంలో సిలోసెబిన్‌ పుట్టగొడుగులు ఉపయోగపడతాయని తెలుసుకున్నాడు. వాటిని మ్యాజిక్‌ మష్‌రూమ్స్‌ అని కూడా పిలుస్తుంటారు. నిజంగానే ఈ రకం పుట్టగొడుగులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి. వీటితో వైద్యులు మెడికల్‌ ట్రయల్స్‌ కూడా చేస్తున్నారు. 

టీ రూపంలో రక్తంలోకి..

ఈ పుట్టగొడుగులను లేదా వాటితో తయారు చేసిన మందుల్ని నోటి ద్వారా తీసుకున్నప్పుడే ఫలితం ఉంటుంది. కానీ, ఆ యువకుడు మరో మార్గం ఎంచుకున్నాడు. పుట్టుగొడుగులను రక్తంలోకి ఎక్కించుకుంటే మరింత మంచి ఫలితమొస్తుందని భావించాడు. ఇందుకోసం పుట్టగొడుగులను మరగబెట్టి టీ తయారు చేశాడు. ఆ టీని ఇంజక్షన్‌ రూపంలో తన రక్తంలోకి ఎక్కించుకున్నాడు అంతే.. రెండు రోజులకే యువకుడు అస్వస్థతకు గురవడం మొదలైంది. మొదట నీరసం, రక్తంతో వాంతులు జరిగాయి. ఆ తర్వాత కామెర్లు, డయేరియా వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

22 రోజులు ఆస్పత్రిలోనే..

బాధితుడికి అనేక పరీక్షలు నిర్వహించిన వైద్యులు నివేదికలు చూసి ఆశ్చర్యపోయారు. అతడి శరీరంలోని అన్ని అవయవాల పనితీరు క్షీణిస్తున్నట్లు తేలింది. అతడు తీసుకున్న పుట్టగొడుగుల టీ వల్ల రక్తంలో పుట్టగొడుగులు పెరగడం ప్రారంభించాయి. అతడి రక్తంలో బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ జరిగినట్లు గుర్తించారు. దీంతో యువకుడిని కాపాడేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. డయాలసిస్‌ చేసి రక్తాన్ని శుభ్రపర్చారు. ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి మందులు ఇచ్చారు. అలా 22 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందడంతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. అతడి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుండటంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. ఈ కేసు.. వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని మరోసారి చాటిచెప్పిందని వైద్యులు అంటున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని