Andhra news: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్ల ఎత్తివేత

నాగార్జున సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 4.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా.. అవుట్‌ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఉదయం ఆరు క్రస్టు గేట్లను

Published : 11 Aug 2022 22:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగార్జున సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 4.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా.. అవుట్‌ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఉదయం ఆరు క్రస్టు గేట్లను 5అడుగుల మేర ఎత్తిన అధికారులు.. క్రమంగా వరద ఉద్ధృతి పెరగడంతో సాయంత్రానికి ప్రాజెక్టు 26గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో సాగర్‌ అందాలను చూడటానికి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. నాగార్జున సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 306.39 టీఎంసీల నీరు ఉంది. వరద తాకిడి పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద..

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన నుంచి వరద ప్రవాహం భారీగా ఉండడంతో ప్రాజెక్టు 17గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3.43లక్షల క్యూసెక్కులు ఉండగా.. 4.41లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 33.17గా ఉంది. ప్రాజెక్టు దిగువన నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత..

ఎగువన నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతోంది. దీంతో బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 10 గేట్లను 3 అడుగుల మేర, 60 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 1.18లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని