Traffic challan: పిల్లాడి డబ్బులను తిరిగిచ్చి.. ఆటో చలాన్లు పోలీసే కట్టారు!

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడ్డ ఆటో డ్రైవర్‌కు విధించిన చలాన్లను సీనియర్‌ పోలీసు అధికారే చెల్లించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు

Published : 17 Aug 2021 01:34 IST

నాగ్‌పూర్‌: ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడ్డ ఆటో డ్రైవర్‌కు విధించిన చలాన్లను సీనియర్‌ పోలీసు అధికారే చెల్లించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వారికి అండగా నిలిచారు. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. తాజాగా ఈ ఫొటోను నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగింది..?

రోహిత్‌ ఖడ్సే అనే వ్యక్తి చాలా రోజుల నుంచి నాగ్‌పూర్‌లో ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతను ఆగస్టు 8న ఆటోను నో పార్కింగ్‌ జోన్‌లో నిలిపాడు. అది గుర్తించిన పోలీసులు రూ.200 జరిమానా విధించారు. ఇదే విధంగా అంతకు ముందు కూడా ఆటోపై కొన్ని చలాన్లు పడ్డాయి. దీంతో కలిపి మొత్తం ఆటోపై రూ.2000 వరకు చలాన్లు ఉన్నాయి. ఆ విషయం గమనించిన పోలీసులు కట్టాల్సిన జరిమానాలు చాలా ఉన్నాయని.. మొత్తాన్ని కట్టాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. లేదంటే ఆటోను సీజ్‌ చేస్తామన్నారు. ఆ డ్రైవర్‌ దగ్గర డబ్బు లేకపోవడంతో చెల్లించలేకపోయాడు. దీంతో ఆటోను పోలీసులు పట్టుకెళ్లారు. ఆటో లేకపోయే సరికి కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆటోను ఎలాగైనా తెచ్చుకోవాలని డబ్బు కోసం చాలా ప్రయత్నం చేశాడు.

కొడుకు దాచుకున్న డబ్బులనే తీసుకెళ్లి..

రూపాయి రూపాయి పోగు చేసుకున్న తన కొడుకు పిగ్గీ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకెళ్లి ఆటోను తిరిగి తెచ్చుకోవాలనుకున్నాడు. చిల్లరంతా ఓ మూటలో కట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అది చూసిన పోలీసులు నాణేలు తీసుకోమని తేల్చి చెప్పారు. తన దగ్గర ఇవే ఉన్నాయని అవి కూడా తన కొడుకు పిగ్గీ బ్యాంకు నుంచి తీసుకోచ్చామని డ్రైవర్‌ పోలీసులకు వివరించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌  చలించిపోయారు. వారి ఆర్థిక పరిస్థితి గురించి అర్థం చేసుకుని పిల్లాడి డబ్బులు తిరిగి ఇచ్చేశారు. తన సొంత డబ్బులతో ఆటోపై ఉన్న చలాన్లను కట్టి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆ పిల్లాడికి డబ్బులు ఇస్తున్నట్లుగా ఉన్న ఫొటోను నాగ్‌పూర్‌ సిటీ పోలీస్‌లు ట్విటర్‌లో పంచుకున్నారు. పోలీస్‌ అధికారిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని