Andhra News: విద్యార్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోండి: కేంద్రమంత్రికి లోకేశ్‌ లేఖ

నీట్ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలని దేశవాప్తంగా విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

Updated : 05 May 2022 16:50 IST

అమరావతి: నీట్ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలని దేశవాప్తంగా విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకి లోకేశ్‌ లేఖ రాశారు. కొవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్‌కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థులు ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

‘‘దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షకు హాజరవుతున్న 1.70 లక్షల మంది, తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది విద్యార్థుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి. పరీక్షకు సన్నద్ధం అయ్యేందుకు విద్యార్థులకు సమయం లేకుండా పరీక్షా తేదీలు ప్రకటించారు. మే 21న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కౌన్సెలింగ్‌కి హాజరుకావాలో లేక పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వాలో తేల్చుకోలేక అయోమయ స్థితిలో ఉన్నారు. కొవిడ్ రెండో దశ సందర్భంగా వేసిన డ్యూటీల కారణంగా చాలా మంది ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయలేకపోయారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిన వారికి పరీక్ష రాసే అవకాశం కల్పించాలి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నీట్ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలి’’ అని లోకేశ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని