NEET 2023: నీట్‌కు దరఖాస్తు చేశారా? ప్రిపరేషన్‌లో ఈ టిప్స్‌ పాటించండి!

నీట్‌(NEET) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 18లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులకు కొన్ని టిప్స్‌..

Updated : 13 Mar 2023 16:08 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్ష (NEET UG 2023) పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 7న పెన్ను, పేపర్‌ విధానంలో జరిగే ఈ పరీక్షకు ఏప్రిల్‌ 6 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో నిర్వహించే NEET పరీక్ష సన్నద్ధతపై విద్యార్థులు ఇప్పటికే దృష్టి సారించారు. ఓ వైపు ఇంటర్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌ కొనసాగిస్తూనే నీట్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నిపుణులు సూచించే కొన్ని మెలకువలివే..

  1. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు (మార్చి/ఏప్రిల్‌) ఇంటర్‌ ప్రాక్టికల్స్‌, పరీక్షల హడావుడి ఉంటుంది. అందువల్ల వీటితో పాటు నీట్‌ ప్రిపరేషన్‌ను సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల తర్వాత ఉండే సమయంలో కనీసం 20 మాదిరి (మాక్‌) ప్రశ్నపత్రాలు సాధన చేసేలా చూసుకోండి. 
  2. ప్రతి మాక్‌ టెస్టులో  ఒక్కో సబ్జెక్టుకూ ఎంత సమయం వెచ్చించాల్సి వస్తోంది? ఎన్ని సరైన సమాధానాలు, ఎన్ని తప్పు సమాధానాలు గుర్తించారో ఒక పేపర్‌పై రాసుకోండి. ఈ సమాచారం తర్వాత రాసే మాక్‌ టెస్టును మెరుగ్గా, మరింత నేర్పుతో రాసేందుకు దోహదపడుతుంది. 
  3. ప్రతి మాక్‌ టెస్టులోనూ ఏ తరహా పొరపాట్లు చేస్తున్నారో గమనించండి. ఉదాహరణకు.. ప్రశ్నలోని సమాచారం సరిగా గమనించకపోవడం, ఆప్షన్లను పట్టించుకోకపోవడం, కొన్ని సందర్భాల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్ల నుంచి సరైన దానికి బదులుగా తప్పుగా ఉన్న స్టేట్‌మెంట్‌ గుర్తించాలని అడిగితే తొందరలో సరైన స్టేట్‌మెంట్‌ను గుర్తించడం వంటి పొరపాట్లు చేయొద్దు. 
  4. గ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నల విషయంలోనూ పొరపాట్లకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్‌, వై అక్షాలపై ఏ విలువలు గుర్తించారో గమనించాలి. గ్రాఫ్‌ వాలు, విస్తీర్ణం వంటివాటి ద్వారా జవాబు రాబట్టడం తేలికే. కాకపోతే ఇలాంటప్పుడు ఎక్స్‌, వై అక్షాలపై గుర్తించిన విలువల యూనిట్లను బాగా గమనించాలి.
  5. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలపై పూర్తిగా పట్టు సాధిస్తేనే నీట్‌- 2023లో గరిష్ఠ మార్కులతో మంచి ర్యాంకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
  6. పరీక్ష కేంద్రానికి ఆందోళనతో వెళ్లొద్దు.  అతిగా ఆలోచించి మీ మానసిక ప్రశాంతతను పాడుచేసుకోవద్దు. 
  7. రిలాక్స్‌గా ఉంటూనే మీరు చేయాల్సిన పనులతో పాటు రివిజన్‌ను ఒత్తిడి లేకుండా పూర్తి చేయండి.  
  8. పరీక్ష రోజుకు ఏమేం కావాలో ముందే సిద్ధం చేసుకోండి. ఆఖరి నిమిషంలో హడావుడి పడి అనవసర ఇబ్బందులకు అవకాశం ఇవ్వొద్దు.   
  9. పరీక్షల సమయంలో కొందరు టెన్షన్‌తో సరిగా తినరు. నిద్రపోరు. అలాంటి పనులు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. తగిన నిద్ర ఉండేలా టైమ్‌టేబుల్‌ సిద్ధం చేసుకోండి.
  10. కాసేపు రిలాక్స్‌ అయ్యేందుకు టీవీ, ఫోన్‌, సోషల్‌ మీడియా జోలికి అస్సలు వెళ్లకండి. అటువైపు వెళ్లారంటే మీకు తెలియకుండానే విలువైన  టైం వృథా అయిపోతుంది. ప్రిపరేషన్‌ సమయంలో మీ ధ్యాసంతా పరీక్షలపైనే ఉండాలి. ఆల్‌ ద బెస్ట్‌!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని