అక్కడ ‘దీపావళి’ జరిపే తీరే వేరు!

కార్తీకమాసంలో హిందువులంతా దీపావళి పండుగ జరుపుకుంటారనే విషయం తెలిసిందే. తిథుల ప్రకారం ఎక్కువగా నవంబర్‌ నెలలో ఈ దీపావళి పండుగ వస్తుంటుంది. కొన్ని చోట్ల ఈ పండుగ రెండ్రోజుల నుంచి ఐదు రోజుల వరకు కొనసాగుతుంటుంది. రాత్రుళ్లు ఇంట

Published : 14 Nov 2020 10:10 IST

కార్తీకమాసంలో హిందువులంతా దీపావళి పండుగను  జరుపుకొంటారనే విషయం తెలిసిందే. తిథుల ప్రకారం ఎక్కువగా నవంబర్‌ నెలలో ఈ దీపావళి పండుగ వస్తుంటుంది. కొన్ని చోట్ల ఈ పండుగ రెండ్రోజుల నుంచి ఐదు రోజుల వరకు కొనసాగుతుంది. రాత్రుళ్లు ఇంటా.. బయటా దీపాలు వెలిగించి, లక్ష్మిదేవీని ఆరాధిస్తుంటారు. బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకొంటారు. మన దేశంలో దాదాపు దీపావళి పండుగ ఇలానే జరుగుతుంది. కానీ, పొరుగున ఉన్న హిందూ దేశం నేపాల్‌లో మాత్రం దీపావళి పండుగ కాస్త భిన్నంగా ఉంటుంది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ పండుగలో నాలుగు రోజులు.. నాలుగు జంతువులను పూజించడం విశేషం. 

కాకులను ప్రసన్నం చేసుకుంటారు

ఐదు రోజుల పండుగలో తొలి రోజును ‘కాగ్‌ తిహార్‌’ అని పిలుస్తారు. ఈ రోజున నేపాలీలు కాకులకు పూజలు నిర్వహిస్తారు. కాకిని యమధర్మరాజు దూతగా భావిస్తారు. అందుకే వాటికి దాబాపైనా, పెరట్లో ధాన్యాలు, తీపి పదార్థాలు నైవేద్యంగా పెడుతుంటారు. కాకులను ప్రసన్నం చేసుకోవడం వల్ల ఏడాదిపాటు మరణం నుంచి బయటపడొచ్చని నేపాల్‌ ప్రజలు నమ్ముతారు. 


శునకాలకు ప్రత్యేక పూజ

రెండో రోజున నేపాలీలు శునకాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజును ‘కుకుర్‌ తిహార్‌’ అని అంటారు. శునకాలకు ఉదయాన్నే తలంటు స్నానం చేయించి, దండ వేసి, బొట్టు పెట్టి పూజలు చేస్తారు. అనంతరం వివిధ రకాల వంటలు నైవేద్యంగా శునకాలకు సమర్పిస్తారు. కుకుర్‌ తిహార్‌ శునకాలకు, మనుషులకు మధ్య ఉండే బంధాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకొనే వేడుక. అంతేకాదు, పురాణాల ప్రకారం.. శునకం భైరవుడి అవతారం.. యమదూత. అందుకే వాటిని పూజిస్తారు. 


ఆవు.. లక్ష్మిదేవి.. పూజ

దీపావళిలో మూడో రోజు ‘గాయ్‌ తిహార్‌’. హిందువులు ఆవును దైవంతో సమానంగా కొలుస్తారనే విషయం తెలిసిందే. ఆవులను గోమాతగా ఆరాధిస్తుంటారు. సాధారణ రోజుల్లోనూ వివిధ ఆలయాల్లో, గోశాలల్లో ఆవులకు పూజలు జరుగుతుంటాయి. నేపాల్‌లో గోవుల కోసం ప్రత్యేకంగా ‘గాయ్‌ తిహార్‌’ జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున నేపాలీలు ఆవు మెడలో దండ వేసి, బొట్టు పెట్టి చక్కగా అలంకరిస్తారు. చీకటిగా ఉండే ఇళ్లలోకి దేవుళ్లు రారని అక్కడి వారి నమ్మకం. అందుకే ఇంటి నిండా దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఆ దేవతతోపాటు ఆవును కొలిచి నైవేద్యం సమర్పిస్తారు.


ఎద్దుకు మొక్కులు.. కొత్త సంవత్సరం వేడుకలు 

నాలుగో రోజు ఎద్దును పూజించడం నేపాల్‌ ప్రజల సంప్రదాయం. ఎద్దులు హిందువుల జీవితాల్లో ఒక భాగం. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంలో పొలం దున్నడానికి ఎద్దులను ఉపయోగిస్తారు. రైతులకు ఆప్తులుగా మెలిగే ఎద్దులను గౌరవిస్తూ ఈ పండుగ చేస్తారట. అలాగే శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్థన గిరిని గుర్తుచేసుకుంటూ గోవర్థన పూజ నిర్వహిస్తారు. నేపాల్‌ సంప్రదాయ క్యాలెండర్‌ ప్రకారం ఈ రోజే నూతన సంవత్సరం(నేపాల్‌ సంబాట్‌). 


ఐదో రోజు రాఖీ పండుగలాగే

దీపావళి పండుగలో ఐదో రోజును మన దేశంలో రాఖీ పండుగ నిర్వహించినట్లుగానే నిర్వహిస్తారు. ఈ రోజును ‘భాయ్‌ టికా’ అని పిలుస్తారు. సోదరసోదరీమణుల మధ్య ఉండే బంధానికి ప్రతీకగా ఈ వేడుక జరుపుకొంటారు. మహిళలు తమ సోదరులను ఇంటికి పిలిపించుకొని దండ వేసి, బొట్టు పెడతారు. విందు ఏర్పాటు చేస్తారు. అనంతరం సోదరులు తన సోదరి ఆశీర్వాదం తీసుకుంటారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు