Viral: చేతులు లేకపోతేనేం.. కాలితో క్యారమ్స్‌ ఆడేస్తా!

విభిన్న ప్రతిభావంతులకు ఏకాగ్రత పాళ్లు ఎక్కువ. దృఢసంకల్పంతో

Updated : 21 Nov 2022 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న ప్రతిభావంతులకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. దృఢసంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రతిభ వాళ్ల సొంతం. అలాంటి ఓ విభిన్న ప్రతిభావంతుడు చేతులు లేకపోయినా కాళ్లతో క్యారమ్స్‌ ఆడుతూ ఔరా! అనిపిస్తున్నాడు. 

ముంబయికి చెందిన హర్షద్‌ గోతంకర్‌ చేతులు లేకుండా జన్మించాడు. చేతులు లేకపోయిన కాళ్లతోనే స్విమ్మింగ్‌ చేస్తూ.. ఫుట్‌బాల్‌, క్యారమ్స్‌ ఆడుతూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. మొదట ఫుట్‌బాల్‌ ఆడాలనుకున్న హర్షద్‌కు తన అంగవైకల్యం అడ్డుగా నిలిచింది. దాంతో స్నేహితుని సలహా మేరకు క్యారమ్స్‌ నేర్చుకుని అసాధారణ రీతిలో కాళ్లతో క్యారమ్స్‌ ఆడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. పలువురు ప్రముఖులు, నెటిజన్లు హర్షద్‌ను ప్రశంసిస్తున్నారు. 

హర్షద్‌ ఆటకు ఫిదా అయిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ హర్షద్‌కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. ‘‘సాధ్యాసాధ్యాలనేవి ఒక వ్యక్తి సంకల్పంతో ముడిపడి ఉంటాయి. హర్షద్‌ గోతంకర్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే లక్ష్యంగా ఎంచుకున్నాడు. అతని సంకల్పాన్ని అభినందిద్దాం. విషయాలు సాధ్యమయ్యే మార్గాలను కనుగొనడానికి హర్షద్‌ను ఆదర్శంగా తీసుకుందాం’’ అనే సందేశాత్మక శీర్షికను జోడించి హర్షద్‌ కాలితో క్యారంబోర్డు ఆడుతున్న వీడియోను సచిన్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని