Polavaram Project: మేఘ వర్సెస్‌ జేపీ వెంచర్స్‌... పోలవరం నిర్మాణంలో కొత్త వివాదం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త సమస్య వచ్చి పడింది. గుత్తేదారు మేఘ సంస్థ, జేపీ వెంచర్స్‌ మధ్య వివాదం కారణంగా ఇసుక లేక పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్‌ పనులు

Updated : 23 Mar 2022 05:45 IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త సమస్య వచ్చి పడింది. గుత్తేదారు మేఘ సంస్థ, జేపీ వెంచర్స్‌ మధ్య వివాదం కారణంగా ఇసుక లేక పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్‌ పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ప్రభుత్వం జేపీ వెంచర్స్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, పోలవరం ప్రాజెక్టు పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇసుకను వాడుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని మేఘ సంస్థ చెబుతోంది. అనుమతులు ఉన్నా ప్రాజెక్టు నిర్మాణానికి గోదావరి నుంచి ఇసుక తరలించడానికి వీల్లేదంటూ జేపీ వెంచర్స్‌ సిబ్బంది వాదిస్తున్నారు. గోదావరిలోని ఇసుక రీచ్‌లన్నీ తమవేనని చెబుతున్నారు. ఇసుక తరలింపును జేపీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇసుక తరలించే 250 టిప్పర్లు నిలిచిపోయాయి. అధికారులను సైతం జేపీ వెంచర్స్‌ సిబ్బంది లెక్కచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు అధికారులను సైతం అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్‌  నిర్మాణానికి దాదాపు కోటి  క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరమని మేఘ సంస్థ చెబుతోంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో బయటివారికి అనుమతులు లేవని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మేఘ సంస్థ చెబుతున్నా.. జేపీ వెంచర్స్‌ మాత్రం ఖాతరు చేయడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని