Antarctica: భారత్‌ పేరుతో కొత్త జాతి మొక్క..!

అంటార్కిటికాలోని భారతీయ జీవశాస్త్రవేత్తలు అక్కడ ఓ కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. దానికి మన దేశం పేరు సహా అక్కడి మన పరిశోధన కేంద్రం ‘భారతి’

Published : 09 Jul 2021 01:24 IST

ఇంటర్రెట్‌ డెస్క్: అంటార్కిటికాలోని భారతీయ జీవశాస్త్రవేత్తలు అక్కడ ఓ కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. దానికి మన దేశం పేరు సహా అక్కడి మన పరిశోధన కేంద్రం ‘భారతి’ పేరు మీదుగా ‘బ్రయమ్‌ భారతీయెన్సిస్’ అని నామకరణం చేశారు. ‘ఇండియన్‌ అంటార్కిటిక్‌ మిషన్‌’లో భాగంగా అక్కడ పరిశోధనలు చేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు.. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఆ ప్రాంతంలో కొత్త జాతి మొక్కను కనుగొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బ్రయం భారతీయెన్సిస్‌ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ఆసియా-పసిఫిక్ బయోడైవర్సిటీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా మొక్కలు పెరగడానికి నత్రజని‌, పొటాషియం, భాస్వరం సహా సూర్యరశ్మి‌, నీరు చాలా అవసరం. అయితే ఏడాదిలో ఆరు నెలల పాటు అంటార్కిటికాలో దట్టంగా మంచు కురుస్తుంది. ఆ సమయంలో సూర్యుని జాడ కనిపించదు. ఉష్ణోగ్రతలు సైతం -76 డిగ్రీలకు పడిపోతాయి. ఇలాంటి సంక్లిష్ట వాతావరణంలో ఈ మొక్క ఎలా మనుగడ సాగిస్తోందని శాస్త్రవేత్తలు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

‘ఇండియన్‌ అంటార్కిటిక్‌ మిషన్‌’లో భాగంగా పంజాబ్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. తూర్పు అంటార్కిటికాలోని లార్స్‌మన్‌ హిల్స్ వద్ద ఉన్న భారతి పరిశోధన కేంద్రం సమీపంలో అరుదైన జాతులకు చెందిన నాచు మొక్కలు పెరుగుతున్నాయని ఫెలిక్స్‌ బాస్ట్‌ అనే శాస్త్రవేత్త గుర్తించారు. పంజాబ్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బాస్ట్‌.. ఆ మొక్కలకు సంబంధించిన శాంపిళ్లను యూనివర్శిటీకి తీసుకొచ్చి వాటిపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు.

పెంగ్విన్లు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో ఈ మొక్క పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పెంగ్విన్ల మలంపై ఈ మొక్కలు పెరుగుతున్నట్టు ఫెలిక్స్‌ బాస్ట్‌ వెల్లడించారు. చల్లటి వాతావరణంలో మొక్కలు కుళ్లిపోకుండా ఉండేందుకు పెంగ్విన్ల మలంలో ఉండే నత్రజని దోహదపడుతుందని తెలిపారు. మంచు ఖండంలో పెరుగుతున్న వేడి కారణంగా అక్కడ మునుపెన్నడూ లేని మొక్కల జాడ ప్రస్తుతం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.  

 

 


 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని