NGT: తెలంగాణ ప్రభుత్వానికి ‘ఎన్జీటీ’ భారీ జరిమానా

తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. 

Updated : 22 Dec 2022 13:12 IST

దిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ సుమారు రూ.900 కోట్ల జరిమానా వేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ సహా అనేక ఇతర అనుమతులు లేవని.. నిర్మాణాలను నిలుపుదల చేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని తెలిపింది. ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం వ్యయంలో 1.5 శాతం జరిమానా విధిస్తూ ఎన్జీటీ చెన్నై బెంచ్‌ తీర్పు వెలువరించింది. 

అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడతున్నారంటూ కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వరరెడ్డి, ఏపీ ప్రభుత్వం అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రూ.300కోట్లు జరిమానా విధించింది. దీంతో పాటు పర్యావరణ నష్ట పరిహారం కింద  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.528 కోట్లు, దిండి ప్రాజెక్టులో రూ.92కోట్ల జరిమానా వేసినట్లు ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అమలు చేస్తున్నట్లు తెలిపింది.  జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించాలని.. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) వద్ద జమచేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని