Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 04 Sep 2021 21:04 IST

1. కొత్త ఐపీఎస్‌లను కేటాయించండి: హోం మంత్రికి కేసీఆర్‌ విజ్ఞప్తి

దిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని కోరారు.  గతంలో ఉన్న 9 పోలీస్ జిల్లాల సంఖ్య 20కి, పోలీసు కమిషనరేట్లు రెండు నుంచి తొమ్మిదికి, నాలుగు పోలీసు జోన్లు ఏడుకి పెరిగాయని హోం మంత్రికి వివరించారు. పోలీసు మల్టీ జోన్లు రెండు కొత్తగా ఏర్పాటయ్యాయని తెలిపారు.  ఎస్పీలు, కమిషనర్లు, జోన్‌ ఐజీల సంఖ్య పెంచాల్సి ఉందని చెప్పారు.

2. ప్రజల ఖాతాల్లో రూ.1.05లక్షల కోట్లు జమ చేశాం: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, ప్రతిపక్షాల విమర్శలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. కరోనా కట్టడికి రూ.7,130 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నట్టు స్పష్టంచేశారు. కరోనా వల్ల  రాష్ట్ర రాబడి తగ్గలేదన్న ప్రతిపక్షాల వాదనలు అర్ధరహితంగా ఉన్నాయన్నారు. ‘‘ఏడాదిగా పన్ను పెరుగుదల లేక రూ.7,947 కోట్ల ఆదాయం కోల్పోయాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.లక్షా 27వేల కోట్లు అప్పులు చేసింది. ఇప్పటివరకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల ఖాతాల్లో రూ.లక్షా 5వేల కోట్లు జమచేశామన్నారు. 

సీబీఐ విచారణకు హాజరైన వైకాపా ఎమ్మెల్యే

3. సెంటిమెంట్‌ డైలాగులు కాదు.. పనిచేసే వాళ్లను గెలిపించాలి: హరీశ్‌రావు

‘‘రూపాయి బొట్టు బిళ్ల గెలవాల్నా? నెలకు రూ.2016 పింఛను ఇచ్చే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గెలవాల్నా?.. ఆరవై రూపాయల గడియారం కావాలా?ఆడపిల్ల పెళ్లికి లక్షా పదహారు రూపాయలు కావాలా?. సెంటిమెంట్‌ డైలాగులు కాదు.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇచ్చేటొళ్లు కావాలి. మనకు కల్యాణలక్ష్మీ లక్ష రూపాయాలు ఇచ్చేటొళ్లు కావాలి. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్‌ కిట్‌ ఇచ్చేటొళ్లు కావాలే. దాని గురించి ప్రజలే ఆలోచించుకోవాలి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్‌లో పర్యటించారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు.

4. విశాఖ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో బైక్, కార్ రెంటల్ సర్వీసులు ప్రారంభం

విశాఖలోని పర్యాటక ప్రాంతాలను బైకులు, కార్లపై ప్రయాణిస్తూ సందర్శించాలనుకునే వారికోసం రెంటల్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. విశాఖ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బైక్, కార్ రెంటల్ సర్వీష్‌ను వాల్తేరు డీఆర్‌ఎం అనూప్ కుమార్ సత్పతి ప్రారంభించారు. పర్యాటకంగా ఎంతో పేరొందిన విశాఖలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు.

5. Telagnana Congress: 17న గజ్వేల్‌లో కాంగ్రెస్‌ సభ

ఈ నెల 17న గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాటుపై ఇటీవల చర్చించిన టీపీసీసీ నేతలు.. ఈ మేరకు శనివారం తేదీని ఖరారు చేశారు. తెరాస పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ‘దండోరా’ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ వెల్లడించారు.

6. త్వరలో పూర్తి స్థాయిలో కాబుల్‌ విమానాశ్రయ సేవలు

కాబుల్‌లోని హమీద్‌ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాల పునరుద్ధరణకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్లు అఫ్గాన్‌లోని కతర్‌ రాయబారి సయీద్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ ఖయారిన్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని శనివారం ఓ న్యూస్‌ ఛానల్‌ పేర్కొంది. ఇక్కడి పౌరులకు మానవతా సాయం అందించేందుకు వచ్చే విమానాల కోసం ఇప్పటికే రన్‌ వేను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. మజారే షరీఫ్‌, కాందహార్‌కు రెండు విమానాల రాకపోకలు ఇప్పటికే మొదలయ్యాయని, త్వరలో పౌర విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు.

అమానుషం! ‘ఎవరెవరిని చంపాలి’ జాబితా’ను సిద్ధంచేస్తున్న తాలిబన్లు
అధికారమైతే వచ్చింది.. పాలన ఎలా?.. తలలు పట్టుకుంటున్న తాలిబన్లు

7. ఉగ్ర దాడులకు అవకాశం ఉంది.. జాగ్రత్త! నిఘా వర్గాల హెచ్చరిక

దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు.. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింతగా పెంచాలని సూచించారు. జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కారు పేలుళ్ల తరహాలోనే మరోసారి ఆ దేశ పౌరులనే లక్ష్యంగా చేసుకొని ముష్కర మూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. 

8. అందుకే ‘టక్‌ జగదీష్‌’ ఓటీటీలో విడుదల చేస్తున్నాం!

కరోనా పరిస్థితుల వల్లే ‘టక్‌ జగదీష్‌’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత సాహు గారపాటి తెలిపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని అనుకున్నాం. ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాం. కరోనాతో మా ఆశలు అడియాసలు అయ్యాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలు అందరిలోనూ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. 

9. యజమాని నిబంధనలను ఉద్యోగులు సవాలు చేయొచ్చు.. సుప్రీంకోర్టు తీర్పు

యాజమానులు అమలుచేసే ఉద్యోగ నియమ నిబంధనలు చట్టాలకు అనుగుణంగా లేకుంటే వాటిపై ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఓ విశ్వవిద్యాలయానికి చెందిన ఫార్మాస్యుటికల్‌ విభాగం 2011లో జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలోని అంశాలు, నియామక పత్రంలో పేర్కొన్న నిబంధనలను సవాలు చేస్తూ అధ్యాపకులు వేసిన దావాను న్యాయమూర్తులు జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నిబంధనలను సవాలు చేసే అధికారం ఉద్యోగులకు ఉందని తెలిపింది.

10. టీమ్‌ఇండియా మూడో రోజే కుప్పకూలుతుంది: మైఖేల్‌వాన్‌

ఓవల్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా.. మూడో రోజే కూప్పకూలుతుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌వాన్‌ జోస్యం చెప్పాడు. కానీ, వికెట్ల కోసం ఇంగ్లాండ్ బౌలర్లు ఓపికగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.‘ఇంగ్లాండ్ బౌలింగ్‌ దళంలోని నలుగురు ఫాస్ట్‌బౌలర్లకు భారత ఆటగాళ్ల ఆటతీరు తెలుసు. మా బౌలర్లు ఓపికగా ఉంటే వికెట్లు దక్కుతాయి. మూడో రోజు ఆటలో మొదటి గంట చాలా కీలకం. ఈ సమయంలో బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌  ఔట్‌సైడ్‌ ఆఫ్‌స్టంప్ బంతులను గమనిస్తూ ఆడుతున్నారు’ అని మైఖేల్‌వాన్‌ అన్నాడు.

INDvsENG: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి
మెరిసిన రోహిత్‌.. విదేశీ గడ్డపై టెస్టుల్లో తొలి శతకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని