Viveka Murder case: వివేకానందరెడ్డి రాసిన లేఖపై నిన్‌ హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.

Updated : 07 Jun 2023 17:10 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించడం కోసం నిన్‌హైడ్రిన్ అనే ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. నిన్‌హైడ్రిన్ పరీక్ష కోసం లేఖను దిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌ కు పంపించేందుకు న్యాయస్థానం సీబీఐకి అనుమతినిచ్చింది. ఒరిజినల్‌ లేఖను కోర్టుకు సమర్పించి.. అవసరమైనన్ని సర్టిఫైడ్‌ కాపీలు తీసి పెట్టుకోవాలని సీబీఐకి కోర్టు తెలిపింది. నిన్‌ హైడ్రిన్‌పరీక్షలో ఒక వేళ ఒరిజినల్‌ లేఖ దెబ్బతిన్నట్టయితే సర్టిఫైడ్‌ కాపీని సాక్ష్యంగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

డ్రైవర్‌ ప్రసాద్‌ హత్య చేసినట్టు హత్యా స్థలిలో ఆరోజున లేఖ లభించింది. లేఖను కడప కోర్టు ద్వారా సీబీఐ 2021లో తీసుకుంది.  లేఖను 2021 ఫిబ్రవరి 11న దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ పంపించింది. ఆ లేఖ వివేకా రాసిందేనా? ఒత్తిడిలో రాశారా?అని విశ్లేషించి నివేదిక ఇవ్వాలని కోరింది. వివేకా రాసిన ఇతర పత్రాలతో పోల్చిన సీఎఫ్ఎస్‌ఎల్‌ .. అది వివేకా రాసిందేనని, అయితే తీవ్ర ఒత్తిడిలో రాసినట్లు తేల్చి సీబీఐకి నివేదిక ఇచ్చింది. ఆ లేఖను బలవంతంగా రాయించినట్టు అప్రూవర్‌ దస్తగిరి తెలపడంతో.. దానిపై వేలిముద్రలు గుర్తించి ముద్రించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను సీబీఐ కోరింది.

లేఖపై వేలిముద్రలు గుర్తించాలంటే నిన్‌ హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఫోరెన్సిక్‌ నిపుణులు సీబీఐకి తెలిపారు. అయితే.. నిన్‌హైడ్రిన్ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుందని పేర్కొంది. లేఖ కీలక ఆధారంగా ఉన్నందున సీబీఐ అధికారులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతివ్వాలని.. ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను రికార్డుల్లో ఉంచాలని కోర్టును సీబీఐ కోరింది. లేఖపై అనుమానితుల వేలిముద్రలను పోల్చాల్సి ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. సీబీఐ అభ్యర్థనపై నిందితులు అభ్యంతరం తెలిపారు. సీబీఐ పిటిషన్ చట్టసమ్మతం కాదని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇటీవల ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. ఇవాళ తీర్పు వెల్లడించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని