NitinGadkari: తెలంగాణలో రూ.1.10లక్షల కోట్ల ప్రాజెక్టులు చేపట్టాం: నితిన్‌ గడ్కరీ

కేంద్రం ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

Updated : 08 Jul 2023 13:53 IST

వరంగల్‌: కేంద్రం ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు.

ముందుగా బహిష్కరించాల్సింది.. కల్వకుంట్ల కుటుంబాన్ని: కిషన్‌రెడ్డి

భాజపా ప్రభుత్వం తెలంగాణ కోసం అంకిత భావంతో పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు మెరుగయ్యాయన్నారు. ‘‘ రాష్ట్రం కోసం కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. రూ.720 కోట్లతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.1900 కోట్లతో హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిని మంజూరు చేశాం. ఇవాళ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నాం. దీని ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తాయి.’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

ప్రధాని మోదీ 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలదని కిషన్‌రెడ్డి అన్నారు. భారాస నేతలు మోదీ కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో చెప్పాలన్నారు. ‘‘ రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తున్నందుకు బహిష్కరిస్తున్నారా? రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెడుతున్నందుకు బహిష్కరిస్తున్నారా? ఈ రాష్ట్రంలో ముందుగా బహిష్కరించాల్సింది.. కల్వకుంట్ల కుటుంబాన్నే. హమీలు ఇచ్చి తప్పినందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి’’ అని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

బంగారు తెలంగాణ సత్తా భాజపాకే : ఈటల

వరంగల్‌ గడ్డమీద రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టిన ఇవాళ.. తెలంగాణ జిల్లాలకు శుభసూచికమని ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకే ప్రధాని వచ్చారన్నారు. ‘‘ కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారు. హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్‌ను ఓడించాలి. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్‌ మాటలు చెప్పారు. బంగారు తెలంగాణ చేతల్లో చేసి చూపించే సత్తా భాజపాకే ఉంది’’ అని ఈటల తెలిపారు.

ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత మోదీ: బండి

‘ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత ప్రధాని నరేంద్ర మోదీ’ అని తెలంగాణ భాజపా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ‘‘ ప్రపంచ దేశాలే పాదాభివందనం చేసే నేత మోదీ. రూ.6 వేలకోట్ల పనులు ప్రారంభించిన మోదీకి కరీంనగర్‌ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఏం ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ వస్తారని కొందరు ప్రశ్నించారు. 10 వేల మంది వరకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని మోదీ వచ్చారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీ చేసేందుకు మోదీ వచ్చారు. ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్‌కు ముఖం లేదు. మోదీ వస్తే కేసీఆర్‌కు కొవిడ్‌ వస్తుంది.. జ్వరం వస్తుంది’’ అని బండి సంజయ్‌ విమర్శించారు. పార్టీ తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సహా అనేక అవకాశాలు కల్పించిందని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని