
నిలువు నీడలేని హ్యాట్రిక్ ఎమ్మెల్యే
దయనీయ పరిస్థితిలో భద్రాచలం మాజీ శాసనసభ్యుడు
ఇంటర్నెట్ డెస్క్: మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు.. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ప్రజల కోసం పనిచేశారు.. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లారు.. కానీ, ప్రస్తుతం ఉండడానికి ఇల్లు కూడా లేక కుమార్తె ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరతరాలు కూర్చొని తినేలా డబ్బు పోగేస్తున్న నేటి కాలంలో ఆయనొక అరుదైన నేత. ఆయనే భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి.
కుంజా బొజ్జిది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం అడవి వెంకన్న గూడెం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన ఆయన చిన్నప్పుడే సీపీఎం సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరఫున పలు పోరాటాలు చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొజ్జి కాలినడకనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రజల్లో మంచి పేరు గడించిన ఆయన భద్రాచలం నుంచి 1985-1999 వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్నా సైకిల్ పైనే కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు.
కుంజా బొజ్జి, లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. భార్యతో కలిసి పూరి గుడిసెలో జీవించేవారు. గతేడాది భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో ఈయన ఒంటరయ్యారు. 95 ఏళ్ల వయస్సులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన భద్రాచలంలో ఉంటున్న కుమార్తె వద్ద కాలంవెళ్లదీస్తున్నారు. కుంజా బొజ్జి పరిస్థితి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంత ఆర్థిక సాయం చేశాయి. ఈ మాజీ ఎమ్మెల్యేకు ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.