Power Crisis: దేశంలో విద్యుత్‌ సంక్షోభం లేదు : కేంద్రం

దేశంలో ఎటువంటి కరెంటు సంక్షోభం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గరిష్ఠ వినియోగ డిమాండ్‌ కంటే ఉత్పత్తి సామర్థ్యం భారీగా ఉందని పేర్కొంది.

Updated : 16 Mar 2022 04:36 IST

డిమాండ్‌ కంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం ఉందన్న కేంద్ర విద్యుత్‌శాఖ

దిల్లీ: దేశంలో ఎటువంటి విద్యుత్‌ సంక్షోభం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గరిష్ఠ వినియోగ డిమాండ్‌ కంటే ఉత్పత్తి సామర్థ్యం భారీగా ఉందని పేర్కొంది. 2021-2022లో గరిష్ఠ డిమాండ్‌ 203 గిగా వాట్లుగా ఉండగా.. ఉత్పత్తి సామర్థ్యం భారీగానే ఉందని తెలిపింది. దేశంలో విద్యుత్‌ సంక్షోభంపై పార్లమెంట్‌ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

‘దేశంలో కరెంటు సంక్షోభం లేదు. ఫిబ్రవరి 28, 2022 నాటికి ఉత్పాదక సామర్థ్యం 395.6 గిగావాట్లు. ఇది దేశంలో గరిష్ఠ అవసరానికి సరిపోతుంది’ అని వీకే సింగ్‌ పేర్కొన్నారు. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) గణాంకాల ప్రకారం, గతేడాది ఏప్రిల్‌-జనవరిలో బొగ్గు దిగుమతి 39 మిలియన్‌ టన్నులుగా ఉండగా.. 2021-22 నాటికి అది 22.7 మిలియన్‌ టన్నులకు తగ్గిపోయిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధర అత్యధికంగా ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. స్థానికంగా ఉత్పత్తి పెంచడం వల్ల ఈ లోటును భర్తీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక 2030 నాటికి శిలాజేతర ఇంధనంతో (హైడ్రో, న్యూక్లియర్‌, సోలార్‌, గాలి, బయోమాస్‌) విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు చేరుకోవడమే లక్ష్యమన్న కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌.. తద్వారా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, గతేడాది అక్టోబర్‌ నెలలో బొగ్గు కొరత వల్ల పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు కరెంటు కొరత ఏర్పడిందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గెయిల్‌, డిస్కం సంస్థల మధ్య సమాచార లోపం వల్లే పలు రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఏర్పడినప్పటికీ విద్యుత్‌ సంక్షోభం మాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలో అవసరాల కంటే ఉత్పాదక సామర్థ్యం ఎక్కువగా ఉందని కేంద్రవిద్యుత్‌ శాఖ తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని