గోవా వెళ్లాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే..!

కొవిడ్‌ మహమ్మారి అదుపులోకి వచ్చిందంటూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పర్యాటకానికి గేట్లు తెరిచినా.. గోవా వెళ్లాలనుకునేవారు మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే. రాష్ట్రంలో అందరికీ కొవిడ్‌ టీకా

Published : 18 Jun 2021 01:27 IST

పానాజి: కొవిడ్‌ మహమ్మారి అదుపులోకి వచ్చిందంటూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పర్యాటకానికి గేట్లు తెరిచినా.. గోవా వెళ్లాలనుకునేవారు మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే. రాష్ట్రంలో అందరికీ కొవిడ్‌ టీకా తొలి డోసు ఇచ్చే వరకు పర్యాటకానికి అనుమతించేది లేదని గోవా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాష్ట్ర ప్రజలందరికీ జులై 31 వరకు తొలి డోసు టీకా ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ వెల్లడించారు. పర్యాటకానికి అనుమతించే అంశంపై జులై 30 తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. దీంతో గోవా పర్యాటకులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పడం లేదు. 

కొవిడ్‌ కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలైంది. అయితే గోవా సీఎం నిర్ణయాన్ని నెటిజన్లు తెలివైన చర్యగా పేర్కొంటూ ప్రశంసించారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులకు కొవిడ్‌ పరీక్ష అవసరం లేదంటూ ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడి జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బార్లు తీరాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవాలోనూ పర్యాటకానికి అనుమతిస్తే కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొవిడ్ కట్టడిలో భాగంగా ఈ నెల 21 వరకు కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పలు ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినట్లు సీఎం ప్రమోద్‌ సావంత్‌ ట్విటర్‌లో తెలిపారు. 18-44 ఏళ్ల మధ్య వయసు వారందరికీ ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం గోవాలో ఇప్పటివరకు 1.6 లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదు కాగా.. 2,900 మందికి పైగా వైరస్‌ ప్రభావంతో చనిపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు