TajMahal: ఇకపై ఉదయం 6 గంటలకే..!

సుప్రభాత వేళ తాజ్‌ మహల్‌ అందాలను చూడాలనుకునేవారికి ఆగ్రా పర్యాటక సంక్షేమ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై తాజ్‌ను సందర్శించేందుకు ఉదయం 6 గంటల

Published : 15 Jul 2021 01:38 IST

ఆగ్రా: సుప్రభాత వేళ తాజ్‌ మహల్‌ అందాలను చూడాలనుకునేవారికి ఆగ్రా పర్యాటక సంక్షేమ శాఖ తీపి కబురు చెప్పింది. ఇకపై తాజ్‌ను సందర్శించేందుకు ఉదయం 6 గంటల నుంచే అనుమతించనుంది. ఈ మేరకు ఆగ్రా పర్యాటక సంక్షేమ శాఖ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రహ్లాద్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఇప్పటిదాకా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాజ్‌ను దర్శించేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. దీంతో బంగారు వర్ణంలో మెరిసే తాజ్‌ సోయగాన్ని వీక్షించే అవకాశాన్ని పర్యాటకులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో తాజ్‌ అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శకులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో తాజ్‌ సందర్శన సమయాల్లో మార్పులు చేయలేకపోయామని ప్రహ్లాద్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం ఆంక్షలను కొంతమేర సడలించడంతో భానుడి తొలి కిరణాలు తాకుతున్న తాజ్‌ అందాలను చూసే అవకాశం పర్యాటకులకు కలగనుందని వివరించారు. ఆగ్రాలోని ఇతర చారిత్రక కట్టడాలను కూడా ఉదయం 6 గంటల నుంచి  సాయంత్రం 6 గంటల వరకు సందర్శించే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు తాజ్‌మహల్‌ను సందర్శించాలంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఒక రోజు ముందుగానే ఆగ్రాకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పర్యాటక రంగానికి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని