Afghan: పిల్లలతో సహా అఫ్గాన్‌లో చిక్కుకున్న నర్సు.. కాపాడాలని కేంద్రానికి వినతి

అఫ్గానిస్థాన్‌లో నర్సుగా పనిచేస్తున్న ఓ భారత మహిళ సహా ఆమె కుటుంబం అక్కడే చిక్కుకుపోయింది. సహాయం చేసేందుకు భారతీయులెవరూ ఇంటి పరిసరాల్లో లేకపోవడం.....

Updated : 24 Aug 2021 04:23 IST

కోల్‌కతా: అఫ్గానిస్థాన్‌లో నర్సుగా పనిచేస్తున్న ఓ భారత మహిళ సహా ఆమె కుటుంబం అక్కడే చిక్కుకుపోయింది. సహాయం చేసేందుకు భారతీయులెవరూ ఇంటి పరిసరాల్లో లేకపోవడం, ఇంటి బయట తాలిబన్లు గస్తీ కాస్తుండటంతో ఆమె కాబుల్‌ విమానాశ్రయానికి చేరుకోలేకపోతోంది. కుమార్తెను, మనవళ్లను కాపాడి భారత్‌కు తీసుకురావాలని నర్సు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కోల్‌కతాకు చెందిన ఓ నర్సు అఫ్గాన్‌ పౌరుడిని వివాహం చేసుకొని 2002లో అఫ్గానిస్థాన్‌కు వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలతో రాజధాని కాబుల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో ఉంటోంది. ఆమెకు ఇద్దరు సంతానం. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త నుంచి విడిపోయింది. అయితే ప్రస్తుతం అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకుకొని ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నారు. భారత్‌కు వచ్చేందుకు పాస్‌పోర్టు, వీసా సిద్ధంగా ఉన్నప్పటికీ నర్సు ఇంటి నుంచి బయటకు రాలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలోని ఆమె తల్లిదండ్రులు సాయమందించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి వద్ద నిత్యావసరాలు కూడా నిండుకున్నాయని.. వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు నర్సు తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు.

‘ఇంట్లో నుంచి వారు బయటకు వెళ్లలేకపోతున్నారు. నిత్యావసరాల కోసం మా మనవడు ఇంటి బయటకు వస్తే మా సైన్యంలో కలిసిపోవాలని తాలిబన్లు ఒత్తిడి తెచ్చారంటా. తమ పరిస్థితిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేసినా స్పందించలేదు’ అని సదరు నర్సు తల్లి వాపోయింది. తమ కుమార్తెను, మనవళ్లను క్షేమంగా భారత్‌కు తీసుకురావాలని ఆ తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని