మూగజీవాల సువర్ణ‘అమ్మ’

ఆమె ఓ సాధారణ గృహిణి. వయసు 70 ఏళ్ల పై మాటే. ముగ్గురు సంతానం. ఇంట్లో తీరిక లేని పని. అయినా 20 ఏళ్లుగా రోజూ 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మూగజీవాల ఆకలి తీరుస్తున్నారు కర్ణాటకకు చెందిన సువర్ణమ్మ....

Published : 20 Mar 2021 15:55 IST

20 ఏళ్లుగా వానరాలు, శునకాల ఆకలి తీరుస్తున్న మహిళ

బెంగళూరు: ఆమె ఓ సాధారణ గృహిణి. వయసు 70 ఏళ్ల పై మాటే. ముగ్గురు సంతానం. ఇంట్లో తీరిక లేని పని. అయినా 20 ఏళ్లుగా రోజూ 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మూగజీవాల ఆకలి తీరుస్తున్నారు కర్ణాటకకు చెందిన సువర్ణమ్మ. నాగయాన్‌పాల్యా ప్రాంతంలో నివసించే సువర్ణమ్మ రెండు దశాబ్దాలుగా మూగజీవాల ఆకలి తీరుస్తున్నారు. సొంతూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడగండ్లకు రోజూ వెళ్తారు. వెళ్లే దారిలో మూగజీవాల కోసం కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తారు. వెంట తీసుకెళ్లిన ఆహార పదార్థాలను ఆక్కడ ఉన్న వానరాలకు, శునకాలకు ప్రేమతో అందిస్తారు. సంచులతో సువర్ణమ్మ రాకను గమనించి అక్కడి వానరాలు ఆమె చుట్టూ చేరి గోల చేస్తాయి. ఆహార పదార్థాలు తీసుకొని చెట్లు, గోడలపై ఎక్కి ఆరగిస్తాయి.

సంచిలో కీర దోస, అరటి పండ్లు, టమాటాలు, బిస్కెట్లు, ఇతర ఆహార వస్తువులు ఉంటాయి. వీటిని అక్కడ ఉన్న కోతులు, శునకాలకు సువర్ణమ్మ అందిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో క్రమం తప్పకుండా ఇక్కడికి వస్తానని ఆమె చెబుతున్నారు. తాను రాలేనప్పుడు తన భర్త సుబ్బన్న ఇక్కడికి వచ్చి మూగజీవాల ఆకలి తీరుస్తారని పేర్కొన్నారు. మూగజీవాలు ఆకలితో అలమటించి చనిపోతున్నాయని, అందుకే రోజూ వాటి ఆకలి తీర్చేందుకు ఇంతదూరం వస్తున్నానని సువర్ణమ్మ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని