malleswari: ఒలింపిక్స్‌ క్రీడాకారుల తయారే లక్ష్యం

ఒలింపిక్స్‌ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని తెలుగు తేజం, దిగ్గజ వెయిట్‌ లిఫ్టర్‌, ఒలింపిక్‌ విజేత కరణం మల్లీశ్వరి పేర్కొన్నారు. దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన సందర్భంగా ఈటీవీ ఆమెను సంప్రదించగా పలు విషయాలు మాట్లాడారు....

Updated : 23 Jun 2021 19:36 IST

ప్రతిభగల వారికి యూనివర్సిటీలో అవకాశం

దిల్లీ: ఒలింపిక్స్‌ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని తెలుగు తేజం, దిగ్గజ వెయిట్‌ లిఫ్టర్‌, ఒలింపిక్‌ విజేత కరణం మల్లీశ్వరి పేర్కొన్నారు. దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన సందర్భంగా ఈటీవీ ఆమెను సంప్రదించగా పలు విషయాలు మాట్లాడారు. వీసీగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రీడలను ప్రోత్యహించేందుకు అనుగుణంగా చేపట్టబోయే చర్యలను వెల్లడించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే దిల్లీలో క్రీడావిశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని.. ఇక్కడ లభించే శిక్షణను సద్వినియోగం చేసుకొని ఒలింపిక్‌ పతకాలు సాధించవచ్చని పేర్కొన్నారు. 

శుక్రవారం వీసీగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలిపిన మల్లీశ్వరి.. క్రీడాకారుల చదువు, వారి క్రీడలను సమన్వయం చేసేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలో ప్రణాళికలు రచించనున్నట్లు పేర్కొన్నారు. సరైన సదుపాయాలు లేకే కొన్ని క్రీడలకు కొందరు దూరమవుతున్నారని.. అలాంటి ప్రతిభగల వారికి ఇక్కడ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు క్రీడాకారులను పరీక్షించి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చేందుకు ఎంచుకుంటామన్నారు. ఒలింపిక్స్‌లో నిర్వహించే అన్ని క్రీడలకు సంబంధించి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆంధ్రా క్రీడాకారులకు శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధికి గత 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు మల్లీశ్వరి తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, శిక్షణ ఉంటే క్రీడాకారులు తయారవుతారని, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌ లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు తెలిపారు. సరైన శిక్షణ ఇస్తే ఆరు నుంచి ఏడు సంవత్సరాలలోపు అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారని పేర్కొన్నారు. క్రీడాకారిణిగా ఉన్నప్పుడు సరైన శిక్షణ లేక అనేక కష్టాలుపడ్డానని.. అందుకే ప్రస్తుత క్రీడాకారుల భవిష్యత్తు దృష్ట్యా హరియాణాలో సొంత అకాడమీని ప్రారంభించినట్లు తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని