Telangana News: ఫ్లాట్లు, స్థలాల అమ్మకానికి రంగం సిద్ధం.. నవంబరు 14 నుంచి ఈ-వేలం

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 19 ఆస్తుల విక్రయానికి ఈనెల 11న నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమ్మకం కోసం నవంబరు 14 నుంచి వేలం నిర్వహించనున్నారు. మొత్తం 2,174 ఖాళీ ప్లాట్లు, 485 ఇళ్లు, 25 ఎకరాల స్థలాన్ని విక్రయించనున్నారు. 

Published : 08 Oct 2022 19:58 IST

హైదరాబాద్‌: ప్రత్యామ్నాయ వనరుల  ద్వారా ఆదాయ సమీకరణ మార్గాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆస్తులను విక్రయించనుంది. ఇప్పటికే ఖాళీ స్థలాలు, రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను విక్రయించిన ప్రభుత్వం.. తాజాగా రాజీవ్‌ స్వగృహ సహా ఇతర ఆస్తుల అమ్మకం చేపట్టనుంది. అందులో భాగంగా ఖాళీ ప్లాట్లు, ఇళ్లు, స్థలాలను విక్రయించనుంది. ఆస్తుల విక్రయానికి సంబంధించి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ అధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆదిలాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఖమ్మం కమిషనర్‌, హెచ్‌ఎండీఏ, రాజీవ్‌ స్వగృహ, టీఎస్‌ఐఐసీ అధికారులు పాల్గొన్నారు. 10 జిల్లాల్లోని 19 ఆస్తుల విక్రయానికి ఈనెల 11న నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించారు. అమ్మకం కోసం నవంబరు 14 నుంచి వేలం నిర్వహించనున్నారు. మొత్తం 2,174 ఖాళీ ప్లాట్లు, 485 ఇళ్లు, 25 ఎకరాల స్థలాన్ని విక్రయించనున్నారు. ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, నల్గొండ, కరీంనగర్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని ప్లాట్లు అమ్మకానికి పెట్టనున్నారు. 

కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇళ్లను, వికారాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో భూములను విక్రయించనున్నారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని భూములను హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఈ-వేలం ద్వారా విక్రయిస్తారు. జిల్లాల్లో మాత్రం ఈ-వేలంతో పాటు ప్రత్యక్ష వేలం కూడా నిర్వహిస్తారు. ఈనెల 11న నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అర్వింద్‌ కుమార్‌ ఆదేశించారు. ఇందుకోసం పెండింగ్‌లో ఉన్న అనుమతులు, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ప్లాట్లు, లేఅవుట్లకు సంబంధించిన అన్ని వివరాలను వెబ్‌సైట్లలో పొందుపర్చాలని, స్థానికంగా ప్రకటనలు ఇవ్వాలని అర్వింద్‌ కుమార్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని