అరుదైన వ్యాధి: లాటరీలో రూ.16కోట్ల ఇంజెక్షన్‌

ఏడాది వయసున్న చిన్నారి.. అరుదైన వ్యాధి.. బతకాలంటే రూ.16కోట్ల విలువైన ఇంజక్షన్‌ చేయాలి..

Published : 27 Jun 2021 21:30 IST

కోయంబత్తూరు: ఏడాది వయసున్న చిన్నారి.. అరుదైన వ్యాధి.. బతకాలంటే రూ.16కోట్ల విలువైన ఇంజక్షన్‌ చేయాలి.. తమ బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు చేయని ప్రయత్నమంటూ లేదు.. మొక్కని దేవుడంటూ లేడు. దేవుడు వారి మొర ఆలకించాడో.. లేక పాప అదృష్టమో.. రూ.16కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను లాటరీలో గెలుచుకుంది.

కోయంబత్తూరుకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి జైనబ్‌.. స్పైనల్‌ మస్కులర్‌ ఆట్రోఫీ(ఎస్‌ఎంఏ)తో బాధపడుతోంది. జన్యుపరమైన ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల కండరాలు చచ్చుబడిపోతాయి. కదల్లేని పరిస్థితి వస్తుంది. కొందరిలో శ్వాస తీసుకోవడం కూడా కష్టమే. రూ.16కోట్లు పెట్టి, ఇంజక్షన్‌ కొనుగోలు చేసి కుమార్తెను బతికించుకునేంత స్థోమత జైనబ్‌ తండ్రి అబ్దుల్లా వద్ద లేదు. ఈ నేపథ్యంలో ‘క్యూర్‌ ఎస్‌ఎంఏ’ అనే సంస్థ ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం విరాళాలు సేకరిస్తోందని తెలిసి, అక్కడ తన కుమార్తె పేరు నమోదు చేయించాడు. ఇలా దేశవ్యాప్తంగా ముగ్గురు చిన్నారులకు ఈ ఇంజక్షన్‌ అవసరమవగా, ఇప్పటివరకూ సేకరించిన విరాళాలతో క్యూర్‌ ఎస్‌ఎంఏ ఇంజక్షన్‌ కొనుగోలు చేసింది. శనివారం ఆ ముగ్గురు చిన్నారుల పేర్లు లాటరీ వేయగా, జైనబ్‌ను అదృష్టం వరించింది. ఆ వెంటనే వైద్యుల పర్యవేక్షణలో చిన్నారికి ఇంజెక్షన్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని