Published : 13 Jul 2021 01:13 IST

AP News: చదువులో పీజీలు.. విధుల్లో ప్రశంసలు

ఒంగోలు హెడ్‌ కానిస్టేబుల్‌ ఘనత

ఒంగోలు: చదువుకోవాలనే జిఙ్ఞాస ఉండాలేగానీ వయసుతో పనిలేదు. సమయం లేదనే సాకు లేదు. పోలీసు శాఖలో కేసులు, నేరస్థులను పట్టుకోవడంలో నిత్యం బిజీగా ఉన్నా.. ఆయన చదువును మాత్రం విడిచిపెట్టలేదు. సర్వీసులో ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకుని నాలుగు పీజీలు, న్యాయ పట్టా పొందారు. వృత్తిలోనూ అంతే నిబద్ధతతో పనిచేసి ఎన్నో సత్కారాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇండియన్ పోలీస్ మెడల్‌ను సాధించారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు వై.చంద్రశేఖర్. నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న ఈయన.. ఎప్పుడూ ఏదో ఒక డిగ్రీ మీద దృష్టిపెడుతూ పట్టాలు సాధిస్తున్నారు. డిగ్రీ చదివిన వెంటనే చంద్రశేఖర్‌కు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగం లభించింది. మొదట కృష్ణా జిల్లాలో పనిచేసిన ఈయన 10 సంవత్సరాల తర్వాత అంతర్‌ జిల్లా బదిలీలో ప్రకాశం జిల్లాకు వెళ్లారు. అక్కడ తన పైఅధికారిని చూసి స్ఫూర్తిపొందిన చంద్రశేఖర్‌ చదువును కొనసాగించాలనే జిజ్ఞాస పెంచుకున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే నాలుగు ఎంఏలు పూర్తిచేశారు.

నాగార్జున వర్సిటీ నుంచి సోషియాలజీ, కృష్ణదేవరాయ వర్సిటీలో హిస్టరీ, మధురై కామరాజు వర్సిటీ నుంచి క్రిమినాలజీ అండ్‌ పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల భాషలో పీజీ పట్టాలు అందుకున్నారు. 1999-2002 వరకు ఒంగోలులో రాత్రి కళాశాలలో న్యాయశాస్త్రం కూడా పూర్తిచేశారు. దీంతోపాటు జర్నలిజం, క్రిమినాలజీ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్లలో పీజీ డిప్లొమా కోర్సులు కూడా చేశారు.

సీసీఎస్‌లో ఎక్కువ కాలం సర్వీసు చేయడంవల్ల ఎక్కడ ఏ నేరం జరిగినా ఆ విచారణ బృందంలో చంద్రశేఖర్‌ ఉండి తీరాల్సిందే. అనేక క్లిష్టమైన హత్యానేరాలు, దోపిడీ నేరాలను ఆయన చేధించి పోలీసు శాఖ నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సుమారు 125 రివార్డులు, 10 ప్రశంసాపత్రాలు లభించాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్‌ మెడల్‌ 2020కి గానూ ఈయన ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం అందించే అతి ఉత్కృష్ట సేవా పతకం, రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలు కూడా అందుకున్నారు. ఉద్యోగానికి న్యాయం చేస్తూనే చదువుకుంటూ.. కుటుంబాన్ని సమన్వయ పరుచుకుంటూ ముందుకుసాగారు. చంద్రశేఖర్‌ కృషి, అంకితభావానికి కుటుంబ సభ్యులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత న్యాయవాద వృత్తి చేపడతానని చంద్రశేఖర్‌ పేర్కొంటున్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని