Hearing Loss: హెడ్‌ఫోన్స్‌ వాడకం.. 100కోట్ల మందికి వినికిడి లోపం ముప్పు..?

హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌ వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాలు విపరీతంగా వాడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకు పైగా యుక్తవయసు పిల్లలు, యువతలో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 17 Nov 2022 01:07 IST

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా హెడ్‌ఫోన్స్ వాడకం, పెద్ద శబ్దాలతో మ్యూజిక్‌ ఆలకించడం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌, వేదిక వద్ద భారీ స్థాయి శబ్దాలు వినడం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకు పైగా యుక్తవయసు పిల్లలు, యువతలో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సంబంధించి అధ్యయన నివేదిక బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సురక్షితంకాని శ్రవణ పరికరాల(PLD) వినియోగంపై అమెరికాలోని మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినా పరిశోధకుల బృందం అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, రష్యాల్లో ప్రచురితమైన 33 అధ్యయనాలను విశ్లేషించింది.

సాధారణంగా పెద్దవారిలో 80 డెసిబెల్స్‌, పిల్లల్లో 75 డీబీ శబ్దం మించకూడదు. కానీ, ప్రస్తుతం శ్రవణ పరికరాలు వినియోగించే వారు సరాసరి 105 డెసిబెల్‌(dB) శబ్దాన్ని వింటున్నట్లు నివేదికలు చెబుతున్నట్లు గుర్తించారు. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో యువతలో వినికిడి సమస్య పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరించారు. ముఖ్యంగా ఇటీవల పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాలతో (PLD) వినడంతోపాటు భారీ శబ్దాలుండే మ్యూజిక్‌ వేదికలకు హాజరు కావడం వల్ల యువత వినికిడి లోపం బారినపడే ముప్పు ఉందన్నారు. అందుకే పౌరుల ఆరోగ్యం దృష్ట్యా.. శబ్దాలపై నియంత్రణ పెంచి ‘సురక్షిత శ్రవణ’ విధానాలను అమలు చేయడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు