Updated : 24 Apr 2022 23:53 IST

AIDS: పదేళ్లలో 17లక్షల మందికి హెచ్‌ఐవీ.. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

 

దిల్లీ: అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా దేశంలో పదేళ్ల కాలంలో 17 లక్షల మందికిపైగా ఎయిడ్స్‌​ మహమ్మారి బారినపడ్డారు. 2011-21 మధ్య 17,08,777 మందికి హెచ్​ఐవీ సోకినట్లు జాతీయ ఎయిడ్స్​ నియంత్రణ సంస్థ(NACO) వెల్లడించింది. మధ్యప్రదేశ్​కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్​ గౌర్​ సమాచార హక్కు చట్టం (RTI) కింద చేసిన అభ్యర్థన మేరకు ఎన్‌ఏసీఓ ఈ వివరాలు వెల్లడించింది. అయితే.. ఎయిడ్స్ బారినపడుతున్న వారి సంఖ్య దశాబ్దకాలంగా క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు ఎన్‌ఏసీఓ స్పష్టం చేసింది. అరక్షిత సంభోగం కారణంగా 2011-12లో 2.4లక్షల మందికి హెచ్​ఐవీ సోకగా.. 2020-21లో ఆ సంఖ్య 85,268గా ఉన్నట్లు తెలిపింది.

అయితే ఎయిడ్స్‌ సోకుతున్నవారిలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్ల కాలంలో 3,18,814 మందికి హెచ్​ఐవీ సోకింది. 2,84,577 కేసులతో మహారాష్ట్ర, 2,12,982 కేసులతో కర్ణాటక రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడు (1,16,536), ఉత్తర్​ప్రదేశ్ ​(1,10,911), గుజరాత్​(87,440) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రక్త మార్పిడి, ఇతర సంబంధిత కారణాలతో దేశంలో పదేళ్లలో 15,782 మంది హెచ్​ఐవీ బారిన పడ్డారు. 4,423 మంది చిన్నారులకు తల్లుల నుంచి ఎయిడ్స్‌ సోకింది. 2020 నాటికి దేశంలో 23,18,737 మంది హెచ్​ఐవీతో జీవిస్తున్నారు. వీరిలో 81,430 మంది చిన్నారులున్నారు.

దేశంలో హెచ్​ఐవీ కేసులు స్థిరంగా తగ్గుతున్నాయి. భారత్​లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గురుగ్రామ్​లోని ఫోర్టిస్ మెమోరియల్​ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్‌ సతీశ్​ కౌల్ మాట్లాడుతూ.. టెస్టులు, నిర్ధరణ మొదలు చికిత్స వరకు హెచ్​ఐవీ రోగుల పర్యవేక్షణ విషయంలో భారత ప్రభుత్వ సంస్థ ఎన్‌ఏసీఓ సమర్థంగా పనిచేస్తోందన్నారు. హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ ట్రీట్‌మెంట్ (HAART) పరీక్షలు అందుబాటులో ఉండటంతో హెచ్‌ఐవీ రోగనిర్ధారణ మెరుగుపడిందని తెలిపారు. చికిత్స సులువుగా లభించడం కారణంగా దేశంలో ఎయిడ్స్​ రోగుల పరిస్థితి మెరుగైనట్లు పేర్కొన్నారు. 2000 తర్వాత నుంచి దేశంలో హెచ్​ఐవీ సోకిన రోగుల సంఖ్య తగ్గుతోందన్నారు.

దిల్లీ ద్వారకాలోని ఆకాశ్​ హెల్త్​కేర్​ ఆస్పత్రిలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ ప్రభాత్ రంజన్​ సిన్హా మాట్లాడుతూ.. ‘రెండేళ్లుగా హెచ్​ఐవీ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కరోనా మహమ్మారి, లాక్​డౌన్​ ఆంక్షలు కూడా ఇందుకు కారణం. ఇప్పుడు కొవిడ్ తగ్గిపోతోంది కాబట్టి ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఎవరికైనా హెచ్​ఐవీ సోకినట్లు తేలితే.. సాధ్యమైనంత త్వరగా వారు యాంటీ రెట్రోవైరల్ థెరపీ చేయించుకోవాలి’ అని పేర్కొన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని