Exercise: వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...

మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. 

Updated : 10 Jul 2024 08:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో వైద్యానికి అయ్యే ఖర్చు చూస్తుంటే ఆ మాట అక్షరాల నిజమని అనిపిస్తుంది.ఆఫీసులకు వెళ్తే పనిలో పడి కూర్చున్న చోటు నుంచి కదలకపోవడం, ఇంట్లోనేమో కొన్నిగంటల పాటు నిలబడే పనిచేయడం వల్ల అలసట వస్తుంది కానీ.. శరీరానికి కావాల్సిన వ్యాయామం దొరకడం లేదు. దాంతో ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఒక వ్యక్తి, కుటుంబానికే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం(exercise)పై దృష్టి సారిస్తే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.

భారత్‌లో సగంమందికి పైగా వయోజనులు శారీరక శ్రమ(Physical activity)పై అసలు దృష్టి సారించడం లేదట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫారసుకు తగ్గట్టుగా వ్యాయామం కోసం కనీస సమయం  కేటాయించడం లేదని లాన్సెట్ అధ్యయనం వెల్లడించిన విషయం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం.. ఏరోబిక్‌ యాక్టివిటీ మధ్యస్థాయిలో చేసినప్పుడు వయోజనులు ఒక వారానికి 150 నుంచి 300 నిమిషాలు వెచ్చించాల్సి ఉంటుంది. అదే ఆ శ్రమ ఎక్కువగా ఉంటే 75 నుంచి 150 నిమిషాలు కేటాయించాలని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఐదేళ్ల వయసు నుంచి అన్ని వయసుల వారికి తగ్గట్టుగా సిఫారసులు చేసింది.

మోకాలి నొప్పుల బారినపడకూడదంటే..!

‘‘శారీరక శ్రమకు దూరంగా ఉండటం ప్రపంచ ఆరోగ్యానికి పొంచి ఉన్న ఒక ముప్పు. అది దీర్ఘకాలిక వ్యాధుల భారాన్ని గణనీయంగా పెంచుతుంది’’ అని డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన హెల్త్‌ ప్రమోషన్ డైరెక్టర్ డాక్టర్ రుడిగర్ క్రెచ్‌ వెల్లడించారు. మధుమేహం, హైపర్‌టెన్షన్‌, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో 10 కోట్లమందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన జీవనశైలిలో శారీరక శ్రమను జోడిస్తే.. వ్యక్తిగతంగానే గాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థపై కూడా భారం తగ్గుతుందని సూచిస్తున్నారు.

ఇటీవల కాలంలో యువతలో 30 ఏళ్లు కూడా దాటకముందే మోకాళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. అదే నిరంతర వ్యాయామం చేయడం వల్ల కండరాలు, ఎముకలు దృఢంగా మారతాయి. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ దశ దాటాక ఎముకల వేగంగా పెళుసుబారుతున్నాయని, దానివల్ల ఫ్రాక్చర్లకు అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. యోగా లేక శారీరక శ్రమ కలిగించే క్రీడల వైపు దృష్టిసారించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని సూచించారు. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వ్యాయామానికి సమయం కేటాయిస్తే అదనపు ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించారు.

 డబ్ల్యూహెచ్‌ఓ చెప్పిన టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇప్పటినుంచైనా ప్రయత్నించాలన్నారు. అసలు ఏమీ చేయకుండా ఉండేదానికంటే.. కొద్దికొద్దిగా మొదలు పెట్టడం వల్ల టార్గెట్‌ చేరుకోవడానికి అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఈ ఎక్స్‌ర్‌సైజ్‌లు శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఉపకరిస్తాయని చెప్పారు. డిప్రెషన్‌, యాంగ్జైటీ వంటి సమస్యలను నివారించడమేకాకుండా బ్రెయిన్‌ హెల్త్‌ మెరుగుపడుతుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు