Obesity: మహిళలూ.. అధిక బరువు వదిలించుకోండి ఇలా..!

 అధిక బరువు మహిళలకు పెను విపత్తుగా మారుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, కదలకుండా చేసే పనులతో స్థూలకాయం పెరిగిపోతోంది.

Published : 07 Jul 2022 14:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధిక బరువు(obesity) మహిళలకు పెను విపత్తుగా మారుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, కదలకుండా చేసే పనులతో స్థూలకాయం పెరిగిపోతోంది. హార్మోన్ల లోపంతో నెలసరి చిక్కులు, థైరాయిడ్‌, మధుమేహం, క్యాన్సర్‌ లాంటి సమస్యలు వస్తున్నాయి. వీటికి పరిష్కారం అధిక బరువును వదిలించుకోవడమేనని జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ సునీత చెబుతున్నారు.

సమస్యలు పెరుగుతున్నాయి

మహిళలకు ఆహారం తీసుకోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. ఇంటి పని, ఉద్యోగం చేయడంతో వేళకు అల్పాహారం, భోజనం చేయకపోవడం, జంక్‌ఫుడ్‌ తీసుకోవడంతో తొందరగా ఊబకాయం వచ్చేస్తుంది. ఇంట్లో శ్రమ తగ్గిపోవడం, కార్యాలయాల్లో ఎక్కువ సమయం కూర్చోవడంతో బరువు పెరిగిపోతున్నారు. కొంతమంది మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆహారం, మందులతో బరువు పెరుగుతారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటారు.

ఈ బరువు మంచిది కాదు

మహిళల్లో కొవ్వు పేరుకొని పోవడం రెండురకాలుగా ఉంటుంది. ఒంట్లో పైభాగంలో పేరుకొన్న కొవ్వు పెరిగిన తీరును యాపిల్‌ ఆకృతిగా, పొట్ట కిందిభాగంలో కొవ్వు పెరిగితే బొప్పాయి పండు ఆకృతిగా పిలుస్తారు. శరీరంలో పైభాగంలో కొవ్వు పేరుకొని పోతేనే సమస్య అని చెబుతారు. ఛాతీ, ఉదరం, పొట్ట భాగాల్లో కొవ్వు పెరిగితే కాలేయం, క్లోమం, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణమండలానికి సమస్యల తాకిడి అధికంగా ఉంటుంది. ఇన్సులిన్‌ నిరోధకత పెరిగి మధుమేహం వస్తోంది. హార్మోన్ల అసమతుల్యంతో రుతుస్రావంలో మార్పులు, అండాశయంలో గడ్డలు వస్తున్నాయి. 

ఇలా చేసి చూడండి

భోజనం మానేయడం, పండ్లు మాత్రమే తినడం, చపాతీకి పరిమితం కావడం మంచిది కాదు. అన్ని రకాల ఆకు, కూరగాయలు, భోజనం, అల్పాహారం సరిపడినంత తిని కొవ్వును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. కొవ్వు ఉండే మాంసాహారాలు మానేయాలి. కూల్‌డ్రింక్స్‌ ముట్టుకోవద్దు. శారీరక శ్రమ, వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. ఏరోబిక్‌ వ్యాయామాలు చేయడం మేలు. అయినా బరువు తగ్గకపోతే వైద్యులను కలుసుకోవాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని