oxygen concentrators: ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఎప్పుడు వాడాలంటే..

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కల్లోలం సృష్టిస్తోంది. మునిపటి కంటే తీవ్రంగా విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు అత్యవసరంగా మారింది. కానీ చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక

Published : 29 May 2021 01:40 IST

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కల్లోలం సృష్టిస్తోంది. మునిపటి కంటే తీవ్రంగా విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు అత్యవసరంగా మారింది. కానీ చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక అనేక మంది రోగులు అవస్థతలు పడుతున్నారు. చాలీచాలని పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో కూడా ఏమీ చేయని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు వరంగా మారుతున్నాయి. ఇంతకీ ఏమిటీ కాన్సన్‌ట్రేటర్లు? ఎలా పని చేస్తాయి? వీటి గురించి డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌ ముఖర్జీ, కార్డియాలజిస్ట్‌  ఏం చెబుతున్నారంటే.. 

కరోనా బాధితులకు ఎప్పుడు అవసరం?
ఆక్సిజన్‌ కొవిడ్‌-19 రోగుల్లోని రక్తంలో తగ్గిపోతూ ఉంటుంది. రోగికి అది తగ్గిపోతున్న విషయం లక్షణాల ద్వారా అంతగా తెలియదు. అందుకే కొవిడ్‌లో వచ్చే హైపాక్సి అంటే.. రక్తంలో ఆక్సిజన్‌ తగ్గడాన్ని హ్యాపీ హైపాక్సియా అని పిలుస్తారు. అంటే రక్తంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గుతున్నప్పుడు కూడా రోగులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిలాక్డ్స్‌గానే కనిపిస్తారు. అందుకే దీన్ని హ్యాపీ హైపాక్సియా అంటారు. అయితే ఈ హైపాక్సియా వచ్చిందని తెలుసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి ముందుగాన్నే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించడం కోసమే ‘పల్స్‌ఆక్సీమీటర్‌’ అనే సాధనం ఉంది. ఇందులో ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ సహజంగా అందరికీ 95 కన్నా ఎక్కువగా ఉంటుంది. అది 94 కన్నా తగ్గుతున్నపక్షంలో రక్తంలో ఆక్సిజన్‌ శాతం కచ్చితంగా తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. అది 90 శాతం కన్నా తగ్గిందంటే రోగి పరిస్థితి విషమంగా ఉందనే అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ తగ్గుతున్నప్పుడు మనం ఆక్సిజన్‌ను వెంటనే రోగికి అమర్చాల్సి ఉంటుంది. 

ఆక్సిజన్‌ సిలిండర్‌, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లలో ఏది ఎప్పుడు ఎలా ఎంచుకోవాలి?
ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ ఒక్కసారి కొనుక్కుంటే అది గాలిలోంచి ఆక్సిజన్‌ని మనకు నిరంతరాయంగా అందిస్తూనే ఉంటుంది. దీని వల్ల అది ఆక్సిజన్‌ సిలిండర్‌లాగా మళ్లీ మనం ప్రతీ రోజూ తీసుకొని నింపుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది కరెంటు ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కరెంటు పోతుందో అప్పుడు కాన్సన్‌ట్రేటర్‌ పనిచేయడం మానేస్తుంది. అందుకే ఈ కాన్సన్‌ట్రేటర్‌ వాడేటప్పుడు ఒక బ్యాకప్‌ జనరేటర్‌ లేకపోతే బ్యాకప్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ ఉంచుకోవడం అత్యవసరం.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ ఎలా పనిచేస్తుంది?
మన చుట్టూఉన్న గాల్లోంచి నైట్రోజన్‌ని తొలగించడం ద్వారా కాన్సన్‌ట్రేటర్‌ ఆక్సిజన్‌ని శుద్ధి మనకు అందిస్తుంది. కాన్సన్‌ట్రేటర్‌లో ప్రధానంగా నైట్రోజన్‌ని పీల్చుకునే ఫిల్టర్స్‌ ఉంటాయి. గాలిని ఒత్తిడి సాయంతో ఈ ఫిల్టర్‌లోకి పంపించడం వల్ల కాన్సన్‌ట్రేటర్‌ దాంట్లో ఉన్న నైట్రోజన్‌ని తీసేసి ఆక్సిజన్‌ అధికంగా ఉన్న గాలిని మనకు అందిస్తుంది. 

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ ఉన్న లాభనష్టాలేంటీ?ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మనం తీసుకునే కాన్సన్‌ట్రేటర్‌ ఎక్కువ మోతాదులో పెట్టుకున్నప్పుడు కూడా సరైన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేషన్‌ని మెయిన్‌టైన్‌ చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఆక్సిజన్‌ సిలిండర్లలో దాదాపుగా స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఇండస్ట్రీయల్‌ ప్లాంట్లో తయారు చేసుకుని దాన్ని సిలిండర్లలో ప్రెషర్‌తో నింపి తీసుకొస్తారు. అందుకే ఆ సిలిండర్‌ పైనున్న వాల్‌ని కనుక తిప్పితే ఆక్సిజన్‌ నెమ్మదిగా బయటికి వస్తుంది. సిలిండర్లు కరెంటు పోయినప్పటికీ కూడా శుభ్రంగా పనిచేస్తాయి. అయితే సిలిండర్లను మళ్లీ మళ్లీ నింపుకోవాల్సి ఉంటుంది. రోజంతా ఆక్సిజన్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేని వారికి, అప్పుడప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నవారికి సిలిండర్‌ కూడా సరిపోతుంది. కానీ నిరంతరం ఆక్సిజన్‌ కావాల్సిన వారికి కాన్సన్‌ట్రేటర్‌ ఉంటే మళ్లీ మళ్లీ నింపుకోవాల్సిన అవసరం ఉండదు.   

ఇంట్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను అమర్చుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ని గోడకి ఒకటి లేదా రెండు అడుగుల దూరంలో ఉంచాలి. గోడకి మరీ దగ్గర పెడితే అట్మాస్ఫియిరిక్‌ ఎయిర్‌ని శుభ్రంగా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాన్సన్‌ట్రేటర్‌ని వాడేటప్పుడు తలుపులు కానీ కిటికీలు కానీ తెరిచి ఉంచుకోవాలి. గది తలుపులన్నీ మూసేస్తే ఆ గదిలోని గాలిలో నైట్రోజన్‌ శాతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనీ తలుపులన్నీ తీసుకొని ఉంచుకోవాలి. సిలిండర్‌లు, కాన్సన్‌ట్రేటర్లని నిప్పుకి దూరంగా ఉంచాలి. ఆక్సిజన్‌ అనేది కంబస్టబుల్‌ గ్యాస్‌ కాబట్టి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిలిండర్లు అయితే కొన్ని సార్లు పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్‌ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంటి దగ్గర ఆక్సిజన్‌ పెట్టుకోవడమనేది వైద్యులకు ప్రత్యామ్నాయం కానే కాదు. ఎందుకంటే ఆక్సిజన్‌ అనేది ఒక మెడిసిన్‌ లాంటిది. సరైన మోతాదులో డాక్టర్లు చెప్పినట్లు వాడుకోవడం ముఖ్యం. ఆక్సిజన్‌ అవసరమైన వ్యక్తికి వేరే రకమైన చికిత్స కూడా అవసరం ఉంటుంది. చికిత్స అనేది ఆసుపత్రుల్లో ఇవ్వడం మాత్రమే సాధ్యం అవుతుంది. ఆక్సిజన్‌ సిలిండర్స్‌, కాన్సన్‌ట్రేటర్‌లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ముఖ్యంగా రాత్రి వేళ ఏదైనా ఇబ్బంది ఎదురైతే హెల్ప్‌ లైన్‌ నంబర్లని మాత్రం ముందే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి.

* ప్రాణాధార ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు బాధితులకు నిజంగానే ఒక వరమనే చెప్పుకోవాలి. స్తోమతను బట్టి కొనుగోళ్లు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం ద్వారా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణ వాయువు కొరతను కొంతమేరకైనా అధిగమించవచ్చు

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని