Medaram 2022: మేడారం చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు

తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం సమ్మక్క-సారక్క మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మహాజాతరలో మొదటి రోజైన ఇవాళ సమ్మక్క భర్త పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు గద్దెల వద్దకు చేరుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి...

Updated : 17 Feb 2022 03:30 IST

మేడారం: తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం సమ్మక్క-సారక్క మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మహాజాతరలో మొదటి రోజైన ఇవాళ సమ్మక్క భర్త పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు మేడారం చేరుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాల నడుమ సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని నిన్న పాదయాత్రగా పూజారులు మేడారానికి బయలుదేరారు. 24 గంటలపాటు పాదయాత్ర సాగిన తర్వాత బుధవారం సాయంత్రం పగిడిద్దరాజు మేడారం చేరుకున్నారు. అలాగే కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరునాగారం మండలం కన్నాయిగూడెం నుంచి గోవిందరాజులును మేడారం తీసుకొచ్చారు. మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెలపై కొలువుదీర్చారు. దీంతో మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది.

మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. అమ్మవార్లు గద్దెల వద్దకు చేరుకునే కీలక ఘట్టాన్ని వీక్షించేందుకే వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని(బంగారం) కానుకగా సమర్పిస్తున్నారు. అమ్మవార్లకు బెల్లం, చీరెసారెలు, ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజారతలో రెండో రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున అమ్మవార్లు ఇద్దరూ దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వారిని యథాస్థానానికి తీసుకెళతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని