Published : 19 May 2021 01:18 IST

Traffic Police: ఉదారత చాటుకున్న మహేశ్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి పేదవారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కూలి పని చేస్తేనేగానీ పూటగడవని ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భిక్షాటన చేస్తూ రోడ్డు పక్కన కాలం వెళ్లదీసే వారి వెతలు అన్నీ ఇన్నీ కావు. స్వచ్ఛంద సంస్థలు మనసున్న వాళ్లు అలాంటి వాళ్ల కోసం ఆప్పన్నహస్తం అందిస్తున్నారు. అయినా, ఎక్కడో ఒక చోట ఆకలితో అలమటిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారి పట్ల ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మానవత్వం చాటుకున్నారు. కరోనా అనుమానాలతో మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకోని ఈ పరిస్థితుల్లో ఆకలితో ఖాళీ ప్లేటు పట్టుకుని దీనంగా ఇద్దరు చిన్నారులను చూసి చలించిపోయారు. తన వద్ద ఉన్న లంచ్‌బాక్సు తెచ్చి, ఇద్దరి పిల్లలకు వడ్డించాడు. భోజనం చేస్తున్నప్పుడు ఆ చిన్నారుల్లోని ఆనందం ఆ కానిస్టేబుల్‌ కడుపు నింపింది.

హైదరాబాద్‌ పంజాగుట్టలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మహేశ్‌ చూపిన ఉదారతకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సెల్యూట్‌ పోలీస్‌, శెభాష్‌ మహేశ్‌, హ్యాట్సాఫ్‌ పోలీస్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న చిన్నారుల కడుపు నింపిన గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటున్నారు. లాక్‌డౌన్‌ విధుల్లో నిమగ్నమైన పోలీసులు ఇప్పటికే  బాధితులకు ఆసరాగా ఉంటున్నారు. అనారోగ్యం పాలైన వాళ్లు, వృద్ధులు, మహిళలు, గర్భిణిలను కరోనాకు భయపడకుండా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts