Telangana News: ఎంజీఎం ఐసీయూలో రోగి కాలు, చేతివేళ్లు కొరికేసిన ఎలుకలు.. తీవ్ర రక్తస్రావం

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆర్‌ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి.

Updated : 31 Mar 2022 13:43 IST

ఎంజీఎం (శివనగర్‌): వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆర్‌ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గతకొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్‌ ఎంజీఎంలో చేర్చారు. రోగి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఎంజీఎంలో చేరిన తొలిరోజే రోగి శ్రీనివాస్‌ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో కట్టుకట్టారు. ఇవాళ ఉదయం కూడా ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ వద్ద ఎలుకలు కొరికేయడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు మళ్లీ కట్టుకట్టి చికిత్స అందించారు. శ్రీనివాస్‌కు తీవ్ర రక్తస్రావం కావడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

మరోవైపు ఎలుకల బెడదపై ఆస్పత్రి ఆర్‌ఎంవో మురళి దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో ఆయన ఐసీయూకి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోగి శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని