paulo coelho: కేరళ వీధుల్లో ‘పరుసవేది’

కేరళలోని ఎర్నాకులంలో ఆటో నడుపుతూ జీవనం సాగించే ప్రదీప్‌కి పాలో కోయిలో అంటే ఎనలేని అభిమానం.

Published : 08 Sep 2021 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని కుదిపేసిన నవలల్లో ‘ఆల్కెమిస్ట్‌’ ఒకటి. ప్రముఖ రచయిత పాలో కోయిలో రాసిన ఈ నవలకు కోట్లలో అభిమానులున్నారు. ఇప్పుడా రచయిత చేసిన ట్వీట్‌ కేరళలో వైరల్‌గా మారింది. అక్కడి  రోడ్లపై తిరుగుతున్న ఓ ఆటోపై ఆయన చేసిన ట్వీట్‌ మరోసారి ఆల్కెమిస్ట్‌ పుస్తకానికున్న ఆదరణేంటో రుజువుచేసింది. రచయిత పాలో కోయిలో పేరు ఆటో వెనకాల ఇంగ్లీష్‌ అక్షరాల్లో ఉండటం,  దానికిందే మలయాళంలో ఆల్కెమిస్ట్‌ అని పుస్తకం పేరు రాసి ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోను రచయిత ట్విటర్‌ ఖాతాలో ఆదివారం పంచుకోగా సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడది చక్కర్లు కొడుతోంది.  

కేరళలోని ఎర్నాకులంలో ఆటో నడుపుతూ జీవనం సాగించే ప్రదీప్‌కి పాలో కోయిలో అంటే ఎనలేని అభిమానం.  పదేళ్ల క్రితమే ఆల్కెమిస్ట్‌ మలయాళంలో వచ్చిన అనువాదాన్ని చదివినప్పటి నుంచి వీరాభిమానిగా మారిపోయారు.  మలయాళంలో వచ్చిన ఆయన పుస్తకాలన్నీ చదివేశారట. ఆ అభిమానానికి గుర్తుగానే ఆటో వెనకాల ఆయన పేరును రాసుకున్నానని చెబుతున్నారు ప్రదీప్. అభిమాన రచయిత తన ఆటో గురించి ట్వీట్‌ చేశారని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బివుతున్నారు. ట్వీట్‌ వైరల్‌ అవడంతో కేరళలోని పుస్తక ప్రియులు కోయిలోపై ఉన్న అభిమానాన్ని ట్విటర్‌లో వ్యక్తపరుస్తున్నారు.

మిమ్మెల్నెప్పుడూ మా అభిమాన మలయాళ రచయితల్లో ఒకరిగా, భరతపుర నదీ తీరాల్లోంచి వచ్చినవాడిగానే భావిస్తామని కొందరంటే, మీరెప్పటికీ  విదేశీ రచయిత కారంటూ ఇంకొందరు ట్వీట్స్‌ చేశారు.  బ్రెజిల్‌కు చెందిన పాలో కోయిలో ‘అల్కెమిస్ట్‌’ పుస్తకం ఇప్పటికీ వందకు పైగా భాషల్లో అనువాదమైంది. తెలుగులో ‘పరుసవేది’గా అనువాదమై తొలి ప్రచురణలోనే రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిందీ నవల. ఓ నిధి కోసం అన్వేషిస్తూ వెళ్లే ఓ గొర్రెల కాపరి తనను తాను ఎలా ఆవిష్కరించుకున్నాడనే ఈ నవల కథనం పాఠాకులను కట్టిపడేసింది. ఇప్పటికీ మార్కెట్‌లో విరివిగా అమ్ముడుపోతోందీ నవల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని