Payyavula: బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల.. స్థానిక సంస్థలకు నిధుల విడుదలపై తొలి సంతకం

ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Updated : 11 Jul 2024 17:01 IST

అమరావతి: ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు రూ.250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యావుల తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని వ్యాపారాలు చేసుకోలేనంత స్థాయిలో పన్నులను పెంచడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. పన్నులు తక్కువగా ఉన్నాయని పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొంటున్నారు, పెట్రోల్ కొట్టించుకుంటున్నారని గుర్తు చేశారు. 

ఆర్టీసీకి కూడా కర్ణాటక నుంచే డీజిల్ కొట్టించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క ఫార్చూనర్ కారు పక్క రాష్ట్రాల్లో కొనడం వల్ల ఏపీ రూ.16 లక్షల మేర ఆదాయం కొల్పోతోందని తెలిపారు. పన్నులు పెంచడం ద్వారా రాబడి పెంచుకోవాలనే జగన్ ఆలోచనా విధానం వల్ల ఏపీలో వ్యాపారాలే లేకుండా పోయాయని ధ్వజమెత్తారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను జగన్ ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఏపీ ఎకానమీని జగన్ కుప్పకూల్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మరి కొన్నాళ్లు అప్పులు చేయక తప్పదని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి టీమ్ చంద్రబాబు కృషి చేస్తుందని తెలిపారు. ఆదాయాలు పెరగాలంటే పన్నులు పెంచడమే మార్గం కాదు.. పన్నుల విస్తృతిని పెంచాలని సూచించారు. ఇష్టానుసారంగా పార్టిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచేశారని, దీని వల్ల తెల్లకాగితాల మీద పంపకాలు చేసుకుంటున్నారన్నారు. ఫలితంగా భవిష్యత్తులో తలెత్తే వివాదాలకు జగన్ కారణమయ్యారని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని