TS News: మాస్క్‌ ధరించకపోతే ₹1000 జరిమానా: డీహెచ్ హెచ్చరిక

కరోనా కొత్త వేరియంట్‌ భయాలు వెంటాడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కొవిడ్‌ కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం

Published : 03 Dec 2021 01:32 IST

హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ భయాలు వెంటాడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కొవిడ్‌ కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. గడప దాటి బయట అడుగుపెడితే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణపత్రం ఉండాలని సూచించారు. అలాగే, ఈ రోజు నుంచి మాస్క్‌ ధరించకపోతే ₹1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.  

డెల్టా రకం కంటే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. కేవలం మూడు రోజుల్లోనే మూడు నుంచి 24 దేశాలకు విస్తరించిందని గుర్తు చేశారు. కరోనా ఇంకా పూర్తిగా అంతం కాలేదన్నారు. రాష్ట్రంలో 25లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నట్టు డీహెచ్‌ తెలిపారు. ఇప్పటివరకు 90శాతం మందికి తొలి డోసు పూర్తి కాగా.. 47శాతం మందికి రెండు డోసులూ అందించినట్టు వివరించారు. 

వైరస్‌ ముప్పు నుంచి మనం బయటపడేందుకు మన చేతిలో ఉన్న ఆయుధాలు కేవలం వ్యాక్సిన్‌.. మాస్క్‌లేనన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక, వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించి మాస్క్‌ని తప్పనిసరిగా ధరించాలన్నారు.  మాస్క్‌ ధరించకపోతే ₹1000 జరిమానా విధించనున్నట్టు పునరుద్ఘాటించారు. అన్ని రకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఈ రోజునుంచి వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ని కూడా అధికారులు వెరిఫై చేస్తారని డీహెచ్‌ తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న ఆయన.. గతంలో కరోనా విజృంభణతో లక్షలాది మంది బాధపడ్డారని, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని