కాలుష్యపు కాటు.. ఆరోగ్యంపై వేటు!

రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యం ప్రజలకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించేవారితో సహా రోడ్డు పక్కన నివాసం ఉండేవారు నిద్రలేమి, వినికిడి సమస్యలతో సతమతమవుతున్నారు....

Published : 31 Mar 2021 01:05 IST

వినికిడి సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యం ప్రజలకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించేవారితో సహా రోడ్డు పక్కన నివాసం ఉండేవారు నిద్రలేమి, వినికిడి సమస్యలతో సతమతమవుతున్నారు. శబ్ద కాలుష్య నియంత్రణకు సంబంధిత యంత్రాంగాలు చేస్తున్న కృషి శూన్యమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జాతీయ, రాష్ట్రీయ, గ్రామీణ రహదారులను ఆనుకొని లక్షలాది నివాసాలున్నాయి. ఆయా రహదారులపై నిత్యం లక్షల కొద్దీ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ కలిగించే కాలుష్యం ఎంతన్నది కొలిచే మానిటరింగ్‌ మీటర్లు కొన్నిచోట్ల మాత్రమే ఉన్నాయి. ఈ వాహనాల వల్ల కలిగే శబ్ద కాలుష్యాన్ని కొలిచే మీటర్లున్నా.. వాటి ద్వారా నియంత్రణ మాత్రం సాధ్యం కావడంలేదు. 

భారీ శబ్దాలతో వెళ్లే వాహనాలు రాత్రి పూట రహదారుల పక్కనే ఉన్న కాలనీలకు నిత్యం రణగొణధ్వనుల్ని పంచుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా భారీ పరిశ్రమలు వెదజల్లే శబ్ద కాలుష్యం ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. పరిమితికి మించి శబ్దాలు చేస్తూ కాలుష్యానికి కారకులయ్యేవారికి రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించేందుకు కాలుష్య నియంత్రణ మండలి 2000 సంవత్సరంలోనే నిబంధనలు రూపొందించింది. అన్ని రాష్ట్రాల నియంత్రణా మండళ్లు వీటిని అమలు చేయాలని నిర్దేశించింది. కానీ ఇవేవీ అమలుకు నోచుకోగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు.

రాత్రి పూట వాహనాలు చేసే భారీ శబ్దాల వల్ల నిద్రలేమి, చికాకు వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే వినికిడి సమస్యలు కూడా తలెత్తుతాయంటున్నారు. భారీ శబ్దాలతో ఇబ్బందులు కలిగించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని