బంగారం దొరికితేనే.. వారికి జీవనోపాధి! 

ప్రపంచంలో పసిడికి ఉన్న గిరాకీయే వేరు. ఈ బంగారం కోసం గనుల్లో అన్వేషిస్తారు. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అనేక రీతుల్లో బంగారం వెతుకులాట సాగుతూ వస్తోంది.

Published : 23 Nov 2020 19:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో పసిడికి ఉన్న గిరాకీయే వేరు. ఈ బంగారం కోసం గనుల్లో అన్వేషిస్తారు. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అనేక రీతుల్లో బంగారం వెతుకులాట సాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పర్వతాలపై పసిడి అన్వేషణ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆండీస్‌ పర్వతాల్లో ఈ తరహా వేట ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడి వారిలో వేలాది మందికి బంగారాన్ని వెతికి పట్టుకోవడమే పని. కేవలం ఈ ఉపాధితోనే కుటుంబాన్ని పోషించుకునేవారున్నారు. పర్వతాల్లోనే కాదు మురుగు నీటి నుంచి బంగారాన్ని వేరు చేస్తూ పొట్టపోసుకుంటున్న వారున్నారు. 

ప్రవాహాలతో వచ్చి చేరింది

అక్కడ ఎంత వెతికితే అంత బంగారం దొరుకుతుంది.  పెరూలోని ఆండీస్‌ పర్వతాలను చేరుకుంటే తప్ప ఆ అదృష్టం వరించదు. బంగారం వెండి, రాగి, జింక్‌ వంటి ఖనిజాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో పెరూ ఒకటి. పెరూకు ఈ గనుల తవ్వకాలే ప్రధాన ఆదాయ వనరు. ఆండీస్‌ పర్వత ప్రాంతం బంగారు నిక్షేపాలకు నెలవు. కొన్ని వేల సంవత్సరాలుగా సాగుతున్న నీటి ప్రవాహాలతో చిన్నమొత్తాల్లో ఈ ఖనిజ నిక్షేపాలు జమవుతూ వచ్చాయి. ఇప్పుడవే ఎందరో బంగారు కలల్ని తీర్చుతున్నాయి. పెరూలోని లా రిన్‌కొనడ పర్వతం ఆ దేశంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఆ పర్వతం పైన ఉన్న రాళ్లను తవ్వితే మిణుకుమిణుకుమంటూ మెరిసే బంగారాన్ని చూడవచ్చు.

స్థానిక దుకాణాల్లో విక్రయం 


 

ఇక్కడి వారు ఉదయం లేవగానే ఆండీస్‌ పర్వతాలపైకి ఎక్కుతారు. ఆ కొండలపై మైనింగ్‌ వాళ్లు తవ్వి వదిలేసిన రాళ్లు, చెత్తా చెదారాన్ని వెతుకుతూ అందులో నుంచే బంగారాన్ని వెలికితీస్తారు. ఈ పర్వత ప్రాంతంలో ఉండే చాలా మందికి ఇదే బతుకుదెరువు. బంగారం దొరికితేనే వాళ్ల కడుపు నిండుతుంది. లేదంటే పస్తులు తప్పవు. వీళ్లని పల్లక్యూరస్‌ అంటారు. అంటే బంగారం సేకరించే వాళ్లని అర్థం. పర్వతం పైన కొండల్లో రాళ్లను తవ్వుతూ అణువంత బంగారం దొరికినా సేకరిస్తారు. దాన్ని శుద్ధి చేసి స్ధానిక దుకాణాల్లో విక్రయిస్తారు. వీరిలో కొందరికి వారానికి గ్రాము, లేదా రెండు గ్రాముల బంగారం దొరుకుతుందట. బ్లాక్‌ మార్కెట్లో అతి తక్కువ ధర ఉన్నా అక్కడే అమ్ముతారట. రాళ్ల నుంచి బంగారం వేరు చేయడానికి పాదరసం ఉపయోగిస్తారు. ఇక్కడ పర్వతాల్లోని రాళ్లతో పాటు వాగులోని ప్రవాహంలో బంగారం కోసం వెతుకుతుంటారు. ఈ అన్వేషణలో ఎక్కువ మంది మహిళలే పాల్గొనడం విశేషం. గంటల పాటు రాళ్లను తవ్వుతూ పోతూ మట్టినంత తట్టల్లో సేకరిస్తారు. దీంతో పాటూ వాగుల్లోని నీటిలోకి దిగి అక్కడ అన్వేషణ మొదలుపెడతారు. నీళ్లు, మట్టి నుంచి సేకరించిన బంగారాన్ని జల్లెడ పడతారు. దాన్నుంచి బురదను వేరు చేసి బంగారం సేకరిస్తారు. 15,000 మందికిపైగా ఈ పనిపై ఆధారపడి జీవిస్తుంటారు. బంగారం వెతకడం అంత సులువైన పనికాదు. గంటల తరబడి శ్రమించాల్సి ఉంటుంది. ఇంత కష్టపడే బదులు వేరే పని చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. దానికి ఇక్కడి వారు మిగతా పనుల్లో కన్నా ఇక్కడే ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతారు. 

మురుగు కాలువల్లోనూ!


 

లాటిన్‌ అమెరికాలో బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో పెరూ ఒకటి. ఏటా 150టన్నుల మేర బంగారం ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ పర్వత శ్రేణుల్లో ఏస్థాయిలో బంగారం నిక్షేపాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపొడవైన పర్వతశ్రేణి ఇదే.
ఇక్కడ మురుగులోనూ బంగారం వెతికే వారున్నారు. రోజూ బంగారం తయారుచేస్తున్న క్రమంలో కొంత బంగారం వృథా అవుతుంది. అది గ్రాములో మిల్లీ వంతు కంటే తక్కువగా ఉంటుంది. తయారీ సందర్భంగా కొంత బూడిదలో కలుస్తుంది. తయారీదారులు శుభ్రం చేసినప్పుడు అది కాస్త మురుగు కాలువలోకి వెళ్తుంది. ఇలా మురుగు కాల్వల్లోని బంగారాన్ని కొంత మంది ఒడిసిపట్టుకుంటారు. 

భారత్‌లోనూ ఈ తరహా బంగారం వేట కనిపిస్తుంది. ముఖ్యంగా నదీ తీరాల్లో ఈ అన్వేషణ సాగుతుంది. బంగారం ఖనిజాలున్న నేలపై నుంచి నదులు ప్రవహించినప్పుడు కొంతమేర బంగారం నీటితో పాటు అలా కొట్టుకొస్తుంది. ఆ ఖనిజాలు తీరప్రాంతాల్లో ఉండిపోతాయి. అందుకే చాలా మంది ఇక్కడి ఇసుక, మట్టిలో బంగారు రేణువుల కోసం గాలిస్తారు. దీనికోసం ప్రత్యేక బృందాలుగా తయారవుతారు. ఛత్తీస్‌గఢ్‌‌, ఒడిశాలో ఎక్కువగా ఇలాంటి వారు కనిపిస్తారు. ఎన్నో తరాలుగా వీరికి ఇదే జీవనోపాధి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని