Hyderabad: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి.. ప్రకటించిన నిమ్స్‌ వైద్యులు

సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో బుధవారం ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.

Updated : 26 Feb 2023 22:08 IST

హైదరాబాద్‌: వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందింది. సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి 9.10 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధిస్తుండడంతో తాళలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్‌ చేసుకుని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి.. తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్‌ వైద్యుల బృందం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

మరికొద్దిసేపట్లో ప్రీతి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. భారీ పోలీసుల బందోబస్తుతో మృతదేహన్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ  వివిధ ప్రజా సంఘాల నాయకులు నిమ్స్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.  మరో వైపు  వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి, కాకతీయ మెడికల్‌ కాలేజీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రీతి ఘటనకు కారకుడైన సైఫ్‌ను  శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడకొండ్ల మండలం గిర్నితండాలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కేఎంసీ ప్రిన్సిపల్‌, హెచ్‌వోడీలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నా మనసును తీవ్రంగా కలిచి వేసింది: హరీశ్‌రావు

‘‘మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి అరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని