Human Interesting Story: శివారాధకు అడ్డురాని వైకల్యం..!

అతడికి చిన్నప్పటి నుంచే అంగవైకల్యం. ఒక చేయి పని చేయదు. మరో చేయి పాక్షికంగా మాత్రమే సహకరిస్తోంది. ఐదో తరగతి వరకే చదువుకున్నాడు. కానీ, ఇవన్నీ శివారాధనకు ఏమాత్రం అడ్డంకి కాదంటున్నాడు ‘శివుడు’. అర్చకులకు ఏమాత్రం తీసిపోని పూజా పద్ధతులు అద్భుతంగా తానే నిర్వహిస్తూ..భక్తిని చాటుకుంటున్నాడు.

Published : 29 Nov 2021 18:45 IST

ధనం లేకున్నా గుడి కట్టించాడు.. చేతులు లేకున్నా పూజలు చేస్తున్నాడు

ఇంటర్నెట్‌డెస్క్‌ : అతడికి చిన్నప్పటి నుంచే అంగవైకల్యం. ఒక చేయి పని చేయదు. మరో చేయి పాక్షికంగా మాత్రమే సహకరిస్తోంది. ఐదో తరగతి వరకే చదువుకున్నాడు. కానీ, ఇవన్నీ శివారాధనకు ఏమాత్రం అడ్డంకి కాదంటున్నాడు ‘శివుడు’. అర్చకులకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతంగా పూజలు నిర్వహిస్తూ..భక్తిని చాటుకుంటున్నాడు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలేనికి చెందిన శివయ్యకు పుట్టుకతోనే పోలియో. ఓ చేయి పూర్తిగా పని చేయదు. పాక్షికంగా దెబ్బతిన్న మరో చేయి మాత్రమే అతనికి ఆధారం. 15వ యేట తల్లి చనిపోయింది. అప్పటి నుంచి తండ్రి పట్టించుకోకపోయినా.. అవ్వ, తాత పెంచి పెద్ద చేశారు. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. జీవనోపాధి కోసం మైక్‌సెట్లో మెకానిక్‌గా పనిలో చేరాడు.  విధుల్లో భాగంగా పూజా కార్యక్రమాలకు హాజరవుతున్న క్రమంలో భక్తి భావన ఏర్పడింది. అయ్యప్ప, శివమాలలు ధరించాడు. శివుడిపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. అక్కడి నుంచి శివారాధనలో నిమగ్నమయ్యాడు.

గ్రామంలో శివాలయం లేకపోవడం శివయ్యకు వెలితిగా కనిపించింది. గ్రామస్థులు శివుడి పూజల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడం చూసి స్థానికంగా ఆలయాన్ని నిర్మించాలని శివయ్య అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా సొంత నిధులతోపాటు దాతల సహాయంతో ఊరి చివర్లో ఉండే కొండపై బసవేశ్వరుడి ఆలయాన్ని నిర్మించాడు. చేతులు సహకరించకపోయినా, పూజాధికాల నిర్వహణలోనూ ఎవ్వరి సహాయం తీసుకోకుండానే నిర్వహిస్తున్నాడు. తానే స్వయంగా నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయడంతోపాటు దీపారాధన, పూజలు చేస్తాడు. ఐదో తరగతి వరకు మాత్రమే చదివినా.. శివయ్య మంత్రోచ్ఛారణలోని స్పష్టత ఆలయానికొచ్చే భక్తులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.  ఆధ్యాత్మికతకు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ.. ఈ శివయ్య ఆ శివుడికి చేస్తున్న ఆరాధన చూసి స్థానికులతోపాటు చుట్టు పక్కల ప్రాంత ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు