Health: వేసవిలో పైల్స్‌ వేధిస్తున్నాయా? పరిష్కార మార్గాలివిగో..!

మండే వేసవిలో పైల్స్‌ బాధ వేధిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గడంతో ఈ సమస్య మరింత అధికం అవుతుంది. మల విసర్జన కష్టమై నరకాన్ని చూపిస్తుంది. 

Updated : 10 Aug 2022 11:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మండే వేసవిలో పైల్స్‌ బాధ వేధిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గడంతో ఈ సమస్య మరింత అధికం అవుతుంది. మల విసర్జన కష్టమై నరకాన్ని చూపిస్తుంది. వేసవిలో పైల్స్‌ బాధల నుంచి ఉపశమనం కల్పించడానికి ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలున్నాయి. చికిత్స గురించి  ఆయుర్వేద ఫిజిషియన్‌ పెద్ది రమాదేవి వివరించారు.

బాధలెన్నో: ఒకచోట కూర్చొకుండా అటు ఇటూ తిరిగే వారిని చూస్తే పక్కవారికి కాస్త చిరాకుగానే ఉంటుంది. అది పైకి చెప్పలేని బాధ..ఈ పైల్స్‌ బాధను చెప్పుకోలేక చాలా మంది లోలోపల చాలా మధనపడుతుంటారు. మొలలు చూసేందుకు పిలకలుగా కనపడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్టు కనిపిస్తాయి. వేసవిలో మరింత తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతాయి.

అర్షమొలలు ఎందుకొస్తాయి:  ఆహారం, మల బద్దకం, బాగా ముక్కడంతో అర్షమొలలు బయటకు వస్తాయి. ఫ్యాటీ లివర్‌తోనూ ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కొంతమంది గర్భిణులకు కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. మలం సాఫీగా వెళ్లకపోవడంతోనే మొలలుగా వస్తాయి. 

ఆహార నియమాలు: ఆహార నియమాలను పాటించినట్లయితే అర్షమొలలు రాకుండా చూసుకోవచ్చు. ఎక్కువగా ఆకుకూరలు, జామ, దానిమ్మపండ్లు తినాలి. లోపల వాపు తగ్గడానికి కూడా దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. 

జాగ్రత్తలివీ: కుర్చీలు, డ్రైవింగ్‌ కుర్చీలు మెత్తగా ఉండేలా చూసుకోవాలి. గట్టిగా ఉండే ప్రదేశంలో గానీ, వస్తువులపై కూర్చొవద్దు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఆహార నియమాలను పాటించినట్లయితే మేలు కలుగుతుంది. 

* సాధ్యమయినంత ఎక్కువగా నీళ్లు తాగాలి. మజ్జిగలో కొంత ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. 

* అల్లం, తేనె, నిమ్మరసం, పూదినను నీళ్లలో కలిపి తాగడంతో పైల్స్‌ బాధల నుంచి ఉపశమనం పొందడానికి వీలుంది. 

* అర టీ స్పూన్‌ జీలకర్ర పొడిని గ్లాసు నీటిలో కలుపుకొని నిత్యం తీసుకొంటే పైల్స్‌ తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. 

* ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉల్లిపాయ రసం, పంచదార కలిపి తీసుకోవడం మంచిదే.

* తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరించడం కూడా మేలు చేస్తుంది. 

* కరక్కాయతో చేసిన కషాయం నీటిలో రోజూ ఉదయం, సాయంత్రం కూర్చొవడంతో పైల్స్‌ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతారు. 

* ఇంట్లో దొరికే మెంతులను ఒకరోజు ముందు నానబెట్టి ఉదయం నీళ్లతో సహా తాగాలి

* దానిమ్మ ఆకులు, కాడలను దంచి కషాయంగా చేసి మూడు పూటలా తీసుకున్నా బాగా పని చేస్తుంది. 

* మారేడు కాయలను తీసుకొచ్చి మధ్యలో ఉండే గుజ్జును చెంచా పెరుగులో కలుపుకొని తినాలి.

* వంకాయను కాల్చి తిన్నా అర్షమొలల నివారణకు సాయపడుతుంది. కూరగా కూడా తినొచ్చు.

* కంద కూడా బాగా పని చేస్తుంది. దీన్ని కూరగా తిన్నా పరవాలేదు.

* నువ్వుల నూనె గానీ, బేకింగ్‌ సోడాను మొలలున్న చోట పెట్టినట్లయితే తగ్గిపోతాయి.

* ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని