PM Modi: వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.

Updated : 30 Jun 2024 14:06 IST

హైదరాబాద్‌: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామీణం ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వెంకయ్యనాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన మూడు పుస్తకాలను వర్చువల్‌గా ప్రధాని విడుదల చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ‘13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు.

‘‘వెంకయ్యనాయుడితో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కింది. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారు. అత్యయిక పరిస్థితి వేళ ఆయన పోరాడారు. 17 నెలల జైలు జీవితం గడిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛభారత్‌, అమృత్‌ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు. రాజ్యసభ ఛైర్మన్‌గా సభను సజావుగా నడిపారు. ఆయన సేవలను దేశం మరవదు. ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు వచ్చింది. బిల్లు ఆమోదంలో వెంకయ్య పాత్ర కీలకం. రాజ్యసభ నిర్వహణలో ఆయన అనుభవం ఉపయోగపడింది. దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలి’’ అని ప్రధాని మోదీ అన్నారు.

రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలి: వెంకయ్యనాయుడు

దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారని చెప్పారు. అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలని చెప్పారు. ఆ తర్వాతే ఆంగ్ల భాషలో ఉండాలని కోరారు. మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 

‘‘చట్ట సభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలి. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చు. పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలి. కార్యకర్తలకు నేతలు నియమావళి రూపొందించాలి. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలి. రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలి. గుణం చూసి నాయకులకు ఓటు వేయాలి. మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలంటే చెడు పోకడలను అడ్డుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని