Updated : 31 May 2022 15:24 IST

PM Modi: ఓటు బ్యాంకు కోసం కాదు.. నయా భారత్‌ కోసమే సంస్కరణలు: ప్రధాని మోదీ

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా భారత స్టార్టప్‌లపై చర్చ జరుగుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎగుమతుల్లో దేశం చరిత్ర సృష్టించిందని చెప్పారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే తమ ధ్యేయమని.. సర్జికల్‌ స్ట్రైక్‌ చేయడం పట్ల గర్వపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌ (సీఆర్‌ఐడీఏ)లో కిసాన్‌ సమ్మాన్‌ నిధి లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు.

సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు. ప్రతి రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉండాల్సిందేనని.. దీనివల్ల అవినీతి తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతేకాకుండా శాశ్వత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని వివరించారు. పేదలకు అన్యాయం జరగొద్దని.. వారి పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా 200 కోట్ల వ్యాక్సినేషన్‌ను సుదూర ప్రాంతాల్లోనూ ఉచితంగా అందించామని మోదీ గుర్తు చేశారు. యువత స్వయం సమృద్ధి కోసం ముద్ర రుణాలను అందించామన్నారు. ఓటు బ్యాంకు కోసం కాకుండా నయా భారత్‌ కోసమే ఈ సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నామని ప్రధాని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణకు రానివ్వడం లేదు: కిషన్‌ రెడ్డి

‘‘తెలంగాణలో చేపలు, పాల ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 10 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు కట్టించింది. ఆయుష్మాన్ భారత్‌ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణకు కేసీఆర్‌ రానివ్వడం లేదు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక బాంబు పేలుళ్లు, మతకలహాలు లేవు. రామగుండం ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది. కాలుష్యం పేరుతో నోటీసులు ఇచ్చారు. రైతులకు ఎరువుల కొరత రాకండా చూడాలి. తెలంగాణ బిడ్డకు తొలిసారి రాజ్యసభ సీటు ఇవ్వడం సంతోషం.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిన మోదీ, నడ్డా, అమిత్‌ షాలకు నా కృతజ్ఞతలు. లక్ష్మణ్‌ ఎంపీ అయ్యాక రాష్ట్రంలో భాజపా మరింత బలోపేతం అవుతుంది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని