పులిచింతల, సాగర్‌ వద్ద పోలీసుల మోహరింపు

కృష్ణా బేసిన్‌లోని జలశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో వివాదం నెలకొన్న వేళ జలాశయాల

Updated : 24 Nov 2022 14:49 IST

సత్తెనపల్లి: కృష్ణా బేసిన్‌లోని జలశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో వివాదం నెలకొన్న వేళ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరించారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో నీరు సగం నిండకుండానే తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించడం సరికాదని ప్రాజెక్టు అధికారులు తెలంగాణ జెన్‌కోకు లేఖ రాశారు. అయినా విద్యుత్‌ ఉత్పత్తి ఆపకపోవడంతో నేరుగా తెలంగాణ అధికారులతో చర్చలు జరపాలని భావిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పులిచింతల ప్రాజెక్టు వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో వంద మందికి పైగా పోలీసులు ప్రాజెక్టు ప్రాంతంలో పహారా కాస్తున్నారు. ఇటు వైపు గుంటూరు జిల్లా పరిధిలో ఏపీ, అటు వైపు సూర్యాపేట జిల్లా పరిధిలో తెలంగాణ పోలీసులు మోహరించారు.

మరోవైపు నాగార్జున సాగర్‌ ప్రధాన జల విద్యుత్‌ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తోంది. దీనిపై ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేయాలని సూచించారు. జలాశయంలో సరిపడా నీరు లేకుండా కరెంటు తయారీ చేయటం నీటి నిబంధనలు ఉల్లంఘించటమేనని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌ ప్రాజెక్టు వద్ద కూడా అటు వైపు తెలంగాణ, ఇటు వైపు ఆంధ్రా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టుల వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. జూరాల వద్ద కూడా పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని