వాలంటైన్స్‌‌ డే: భార్యకు గిఫ్ట్‌గా భర్త కిడ్నీ!

ప్రేమికుల దినోత్సవం ప్రేమికులకు ప్రత్యేకం. అందుకే ఈ రోజును ప్రేమికులంతా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. నచ్చిన వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేస్తారు.. ప్రేమించిన వ్యక్తికి బహుమతులు ఇచ్చి ఇంప్రెస్‌ చేస్తుంటారు. బహుమతులంటే సాధారణంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, ఆభరణాలు, ఇతర వస్తువులు ఉంటాయి. కానీ, ఓ వ్యక్తి

Updated : 14 Feb 2021 20:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమికుల దినోత్సవం ప్రేమికులకు ప్రత్యేకం. అందుకే ఈ రోజును ప్రేమికులంతా ఎంతో గొప్పగా జరుపుకొంటారు. నచ్చిన వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేస్తారు.. ప్రేమించిన వ్యక్తికి బహుమతులు ఇచ్చి ఇంప్రెస్‌ చేస్తుంటారు. బహుమతులంటే సాధారణంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, ఆభరణాలు, ఇతర వస్తువులు ఉంటాయి. కానీ, ఓ వ్యక్తి తన భార్యకు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కిడ్నీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. 

అహ్మదాబాద్‌కు చెందిన రితాబెన్‌ పాటిల్‌ గత మూడు సంవత్సరాలుగా ఆటోఇమ్యూన్‌ కిడ్నీ డిస్‌ఫంక్షన్‌తో బాధపడుతోంది. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో వైద్యులు ఆమెకు డయాలసిస్‌ చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయకపోతే జీవితాంతం ఆమె డయాలసిస్‌ చేయించుకుంటూ ఉండాల్సిందే. ఈ పరిస్థితి చూసి రితాబెన్‌ భర్త వినోద్‌భాయ్‌ పాటిల్‌ భరించలేకపోయాడు. తన భార్యను తిరిగి కాస్త సాధారణ స్థితికి తీసుకురావాలంటే కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని గుర్తించిన వినోద్‌భాయ్‌ తన కిడ్నీని భార్యకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దీంతో ప్రేమికుల దినోత్సవం రోజునే.. ఆయన ఇచ్చిన కిడ్నీతో రితాబెన్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఇదే రోజు వారికి 23వ వివాహ వార్షికోత్సవం కావడం విశేషం. 

ఈ విషయంపై స్థానిక మీడియాతో మాట్లాడిన వినోద్‌భాయ్‌.. ‘‘నా కుటుంబంలో ఎంతో ప్రియమైన వ్యక్తి తను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇన్నాళ్లు నాకు తోడుగా నిలిచింది. అలాంటిది ఇప్పుడు తనను ఒంటరిగా ఎలా వదిలేస్తాను?అందుకే నేను నా కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అది ప్రేమ అనుకోండి లేదా బాధ్యత అనుకోండి’’అని సమాధానమిచ్చాడు. ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రేమ, ప్రేమికుల రోజున గొప్ప త్యాగం, మీ భార్యకు మీరు ఇచ్చిన గిఫ్ట్‌.. నిజంగా గొప్పది మీకు సెల్యూట్‌ అని మెచ్చుకుంటున్నారు. రితాబెన్‌ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని