అలాంటి వస్తువులపై వైరస్‌ మనుగడ తక్కువే!

సూక్ష్మరంధ్రాలు ఉండే వస్తువులపై కరోనా వైరస్‌ ఎక్కువ కాలం జీవించలేదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. తొందరగా ఆవిరి అయ్యే స్వభావం ఉన్న ప్రదేశాలు, వస్తువులపై వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Published : 12 Feb 2021 01:07 IST

వాషింగ్టన్‌: శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కరోనా వైరస్‌ ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కువ సమయం మనుగడ సాగిస్తుందన్న విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ వస్తువులు, ప్రదేశాలు, పదార్థాలపై కరోనా వైరస్‌ ఎంతకాలం బ్రతుకుతుందని తెలుసుకోవడం కోసం అధ్యయనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సూక్ష్మరంధ్రాలు ఉండే వస్తువులపై కరోనా వైరస్‌ ఎక్కువ కాలం జీవించలేదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. తొందరగా ఆవిరి అయ్యే స్వభావం ఉన్న ప్రదేశాలు, వస్తువులపై వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటోందని చెబుతున్నారు.

వైరస్‌ కలిగిన తుంపరులు సూక్ష్మరంధ్రాలు కలిగిన వస్తువులపై(పోరస్‌ మెటీరియల్‌) పడినప్పుడు అవి ఎక్కువసేపు ద్రవరూపంలో ఉండలేవని ఐఐటీ ముంబయి పరిశోధకులు వెల్లడిస్తున్నారు. గాజుపై నాలుగు రోజులు, ప్లాస్టిక్‌పై ఏడు రోజులు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌పై ఏడు రోజులపాటు వైరస్‌ బతికి ఉంటుందని గుర్తించిన నిపుణులు, పేపర్‌పై మూడు గంటలు వస్త్రంపై రెండు రోజులు జీవించగలుగుతుందని స్పష్టం చేశారు. అందుకే ఆసుపత్రులు, కార్యాలయాల్లో గాలిచొరబడలేని గ్లాసు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వంటి వస్తువులపై సూక్ష్మరంధ్రాలు కలిగిన వస్త్రాలు కప్పడం వల్ల వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వీటితో పాటు పార్కులు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, ప్రయాణ ప్రాంగణాల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉండే సీట్లపై వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ఇటువంటి వస్తువులను కప్పడమే మేలని పరిశోధనలో పాల్గొన్న రజినీష్‌ భరద్వాజ్‌ సలహా ఇస్తున్నారు.

ద్రవరూపంలో ఉండే సూక్ష్మబిందువుల కాగితంపై గరిష్ఠంగా కేవలం ఆరు గంటలు మాత్రమే జీవించగలవని స్పష్టంచేస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్న వేళ, ఆయా ప్రదేశాల్లో ఇటువంటి వస్తువుల వినియోగాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్‌ వేదికలు వినియోగిస్తోన్న కార్డ్‌బోర్డులు వైరస్‌ మనుగడను నిరోధిస్తాయని, అందుకే వాటిని సురక్షితంగా భావించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..
యాంటీబాడీలను ఏమార్చేలా కరోనాలో మార్పులు!
నిద్రపోయే ముందు వీటికి దూరం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని